శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 01, 2020 , 02:19:17

వినియోగదారులకు భరోసా!

వినియోగదారులకు భరోసా!
  • సత్వర న్యాయం అందిస్తున్నవివాదాల పరిష్కారాల కేంద్రం
  • హైదరాబాద్‌ సహా జిల్లాల్లోచురుకుగా పనితీరు
  • టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని సలహా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ నగరానికి చెందిన ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నదని దవాఖానకెళ్తే పరీక్షలు చేసి మధుమేహం ఉన్నదని నిర్ధారించారు. వైద్యులు సూచించిన మందులు వాడటంతో విపరీతంగా విరోచనాలు అయ్యి ప్రాణం మీదకు వచ్చింది. వేరే దవాఖానకు తీసుకెళ్లగా ఆయనకు డయాబెటిస్‌ లేదని తేలింది. తనకు జరిగిన మోసంపై వివాదాల పరిష్కారాల కేంద్రాన్ని ఆశ్రయించగా.. బాధితుడికి రూ.లక్షా ఆరు వేలు హాస్పిటల్‌ యాజమాన్యం నుంచి పరిహారంగా ఇప్పించి ఆదుకొన్నారు. ఇలాంటి మోసాలు తరుచూ జరుగుతుండటం చూస్తుంటాం.


అయితే, ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎలా చేయాలి? అనే సంశయంతో ఫిర్యాదు చేయకుండా వదిలేస్తుంటారు. దీంతో మోసగాళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. హోటళ్లు, మెడికల్‌ షాపులు, షాపింగ్‌మాల్స్‌, పండ్ల విక్రయ దుకాణాలతోపాటు ఆన్‌లైన్‌ కేంద్రంగా మోసాల సంఖ్య పెరిగిపోయింది. హక్కుల గురించి వినియోగదారులకు తెలియకపోవటంతో సులువుగా మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో తమ వద్దకు వచ్చేవారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తూ పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వినియోగదారుల వివాదాల ప్రత్యామ్నాయ పరిష్కార కేంద్రం భరోసా కల్పిస్తున్నది. 


వేగంగా వివాదాల పరిష్కారం

పెద్దగా ప్రచారంలో లేని ఈ వినియోగదారుల కేంద్రం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం పరిష్కరించిన కేసుల కారణంగా ప్రజలకు చేరువైంది. 2014 నుంచి 2019 డిసెంబర్‌ వరకు 1,560 ఫిర్యాదులు అందగా.. 1,332 కేసులు పరిష్కారమయ్యాయి. ఒక్కో కేసు సగటున 15 నుంచి 45 రోజుల్లోగా పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లోని కేంద్రాలు చురుకుగా పనిచేస్తున్నాయి. 


ఫిర్యాదు చేయడం ఇలా..

వస్తువు లేదా సేవలను కొనుగోలు చేసిన వారు ఏ రకంగానైనా మోసపోయినట్టు గుర్తించగానే ఈ కేంద్రంలో ఫిర్యాదు చేయాలి. బిల్లులు, కంపెనీ పేరు, చిరునామా తదితర విషయాలను తప్పనిసరిగా అందజేయాలి. ఎలాంటి పరిష్కారం కోరుతున్నారో అనేది కూడా స్పష్టంగా ఫిర్యాదులో పేర్కొనాలి. వినియోగదారులకు సమాచారం, సేవలు అందించేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 180042500333తో పాటు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వేదికలను ఏర్పాటుచేశారు.


మోసాలకు తక్షణ పరిష్కారం

వినియోగదారులు మోసపోయిన కేసుల్లో వివాదాల ప్రత్యామ్నాయ పరిష్కారాల కేంద్రాన్ని సంప్రదించడం వల్ల తక్షణ పరిష్కారం పొందవచ్చు. ఇరువర్గాలను పిలిచి సామరస్యంగా సమస్యను పరిష్కరించడంలో ఈ కేంద్రం కృషి అభినందనీయం.  నూతన వినియోగదారుల హక్కుల రక్షణ చట్టంలోనూ మన రాష్ట్రంలో అమలుచేస్తున్న అంశాలను పొందుపరిచారు. 

- పీ సత్యనారాయణరెడ్డి, కమిషనర్‌, పౌరసరఫరాలశాఖ


logo