శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 02:14:00

ఏప్రిల్‌ 14న సీడీఎస్‌ భవనం ప్రారంభం

ఏప్రిల్‌ 14న సీడీఎస్‌ భవనం ప్రారంభం

  • పనులను పరిశీలించిన మంత్రి కొప్పుల, ఎమ్మెల్యేలు

ఎర్రగడ్డ, జనవరి 13: హైదరాబాద్‌ రెహమత్‌నగర్‌ డివిజన్‌ ఎస్పీఆర్‌హిల్స్‌లో రూ.26 కోట్లతో నిర్మిస్తున్న సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ (సీడీఎస్‌) భవనం ఏప్రిల్‌ 14న (అంబేద్కర్‌ జయంతి) ప్రారంభంకానున్నది. ఇందుకు అనుగుణంగా భవనానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. సీడీఎస్‌ భవనాన్ని బుధవారం ఎస్సీ కులాల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌.. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, గువ్వల బాలరాజు, కాలె యాదయ్య, ఆత్రం సక్కు, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌తో కలిసి పరిశీలించారు. వాహనాల పార్కింగ్‌ కోసం సెల్లార్‌లో నిర్మించిన రెండంతస్థులు, స్టడీ సెంటర్‌ కోసం నిర్మించిన ఐదు అంతస్థులు, రెండంతస్థుల్లో నిర్మించిన కాన్ఫరెన్స్‌హాళ్లను పరిశీలించారు. పెండింగ్‌ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

విద్యార్థులకు ఏ లోటూ రావొద్దు 

విద్యార్థులకు ఏలోటు రాకుండా చూడాలని ఎస్సీ, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారులను ఆదేశించారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లకు సకాలంలో నిత్యావసరాలు చేరే లా ఏర్పాట్లుచేయాలని చెప్పారు. తొమ్మిది, ఆపై తరగతుల విద్యాసంస్థల్ని వచ్చేనెల ఒకటినుంచి పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆయన బుధవారం ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాహుల్‌బొజ్జా, మైనారిటీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి నదీమ్‌ అహ్మద్‌, మైనారిటీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి షఫీఉల్లా, ఎస్సీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 


logo