ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 00:35:12

ముగిసిన ప్రచారం

ముగిసిన ప్రచారం

  • జీహెచ్‌ఎంసీ నుంచి స్థానికేతరులు వెళ్లిపోవాలి
  • రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ పార్థసారథి 

హైదాబాద్‌, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార పర్వం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగిసిందని, రాజకీ య పార్టీలు, అభ్యర్థులు ప్రచారాన్ని నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి సూచించారు. లేని పక్షంలో కేసులు నమోదు చేయడంతోపాటు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రచారం కోసం ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి వచ్చిన ఆయా పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు వెంటనే జీహెచ్‌ఎంసీ పరిధి వదిలి వెళ్లిపోవాలని చెప్పారు. ఆదివారం సాయంత్రం డైరెక్టరేట్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మంగళవారం ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 

2,272 కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌ క్యాస్టింగ్‌

బందోబస్తు పర్యవేక్షణకు ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వద్ద ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌, క్యూలైన్‌ నిర్వహణకు మరొక సహాయకుడు ఉంటారని ఎస్‌ఈసీ పార్థసారథి పేర్కొన్నారు. 2,272 కేంద్రాలను లైవ్‌ వెబ్‌ క్యాస్టింగ్‌తో పర్యవేక్షిస్తామని, మరో 1,529 కేంద్రాల్లో సూ క్ష్మ పరిశీలకులు, 5 వేల కేంద్రాల్లో వీడియోగ్రఫీ సిబ్బంది ఉంటారని వివరించా రు. పోలింగ్‌ విధులకు 48 వేల మం దిని నియమించామని చెప్పారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2,831 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకుంటున్నామని చెప్పారు. 

పూర్తికావొచ్చిన ఓటరు స్లిప్పుల పంపిణీ

100 శాతం ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు 92.04 శాతం సిప్పులు పంపిణీచేశామని పార్థసారథి చెప్పారు. టీఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లో ఓటరు స్లిపులు డౌన్‌లోడ్‌ చేసుకోవడంతోపాటు పోలింగ్‌ కేంద్రం లొకేషన్‌ను సైతం తెలుసుకోవచ్చని, మొబైల్‌యాప్‌లో, మైజీహెచ్‌ఎంసీ యాప్‌లో పోలింగ్‌ స్టేషన్‌ లొకేషన్‌ను తెలుసుకునే వెసులుబాటు ఉన్నదని పేర్కొన్నారు. పోలింగ్‌ రోజున పోటీచేసే అభ్యర్థితోపాటు వారి పోలింగ్‌ ఏజెంట్లకు సంబంధించి ఒకటే వాహనాన్ని అనుమతిస్తామని తెలిపారు. ఇప్పటివరకు 500 లీటర్ల మద్యాన్ని, రూ.1,46,37,180 నగదు సీజ్‌చేశామని చేప్పారు. పట్టుకున్నామని, ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై 99 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

మొత్తం ఓటర్లు: 74,44,260

పురుషులు: 38,77,688

స్త్రీలు: 35,65,896

ఇతరులు: 676


మైలార్‌దేవ్‌పల్లిలో అత్యధిక ఓటర్లు: 79,579

రాంచంద్రాపురంలో అత్యల్ప ఓటర్లు: 27,948

పోటీలో ఉన్న అభ్యర్థులు: 1,122

జంగమ్మెట్‌లో అత్యధికంగా పోటీలో: 20 మంది


మొత్తం పోలింగ్‌ కేంద్రాలు: 9,101 

సున్నితమైనవి: 2,336 

అతి సున్నితమైనవి: 1,207

క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్లు: 279


మొత్తం బ్యాలెట్‌ బాక్సులు: 28,683

బ్యాలెట్‌ పేపర్లు: 81,88,686

పోస్టల్‌ బ్యాలెట్లు: 2,831

పోలింగ్‌ సిబ్బంది: 48 వేలు