ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Nov 25, 2020 , 14:52:42

బీజేపీకి ఓటేస్తే కార్పొరేటీకరణకు అంగీకరించినట్టే

బీజేపీకి ఓటేస్తే కార్పొరేటీకరణకు అంగీకరించినట్టే

సంగారెడ్డి : బీజేపీకి ఓటేస్తే కార్పొరేటీకరణకు అంగీకరించినట్టే.. మీ ఓటుతో మీ ఉద్యోగాల భద్రతా ప్రశ్నార్థకం కాకొచ్చు..అంటూ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులతో ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం రాత్రి పటాన్‌చెరులోని జీఎమ్మార్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో బీహెచ్‌ఈఎల్‌, ఓడీఎఫ్‌, బీడీఎల్‌ ఉద్యోగులతో మంత్రి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రధాని మోదీ కార్పొరేట్‌ శక్తులకు పెద్దపీట వేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తున్నదని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టేందుకు ఉద్యోగులందరు సంఘటితంగా ఉద్యమించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల భూముల అమ్మకాలకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి తీర్మానం చేస్తామన్నారు. మేకిన్‌ ఇండియా అంటూ ప్రధాని మోదీ విదేశాలకు అర్డర్లు ఇస్తుంటే, కేంద్ర ప్రభుత్వ సంస్థల పరిరక్షణకోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీహేచ్‌ఈఎల్‌ సంస్థలకు రూ. 40వేల కోట్లు, యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌కు రూ. 30వేల కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చారని తెలిపారు. బీజేపీకి ఓటేస్తే కార్పొరేటీకరణకు అంగీకరించినట్టేనని గుర్తు చేశారు. 


కేంద్ర ప్రభుత్వ మెడలు వంచేందుకు ఐక్య ఉద్యమాలే శరణ్యం అన్నారు. నవంబర్‌ 26న దేశవ్యాప్త సమ్మెకు టీఆర్‌ఎస్‌ బేషరతు మద్దతు ఇస్తుందని మంత్రి పేర్కోన్నారు. పటాన్‌చెరు, రామచంద్రాపురం, భారతీనగర్‌ డివిజన్లలోని మెట్టుకుమార్‌యాదవ్‌, పుష్పనాగేశ్‌, సింధు ఆదర్శ్‌రెడ్డిలకు కేంద్ర ప్రభుత్వ  సంస్థల ఉద్యోగులు, వారికుటుంబాలు, కాంట్రాక్టర్లు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఓట్లు వేసి గెలిపించుకోవాలని మంత్రి కోరారు.

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిర్విర్యం కాకుండా టీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంటులో గళం ఎత్తుతుందన్నారు.  పార్లమెంటులో నవరత్న సంస్థలను కాపాడేందుకు, రక్షణరంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయంకుండా అడ్డుపడుతామన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ రంగసంస్థలను కాపాడుకునేందుకు ఆర్డర్లు ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికే రైల్వే, ఎల్‌ఐసీ, రక్షణరంగ సంస్థలు ప్రమాదంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులతో కలిసి పోరాడేందుకు టీఆర్‌ఎస్‌ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని హామీనిచ్చారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గొంతుగా ఉంటానని ఎంపీ హామినిచ్చారు. కార్యక్రమంలో  మాజీ శాసనసభ్యుడు కే సత్యనారాయణ, చింతప్రభాకర్‌, కార్మిక సంఘం నాయకులు ఎల్లయ్య, పలు కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

VIDEOS

logo