శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 15:10:36

నిధులపై బీజేపీ శ్వేతపత్రం విడుదల చేయాలి : మంత్రి ఎర్రబెల్లి

నిధులపై బీజేపీ శ్వేతపత్రం విడుదల చేయాలి : మంత్రి ఎర్రబెల్లి

జనగామ : బీజేపీ పార్టీ ఇచ్చేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ అని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు విమర్శించారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలోని దేవరుప్పుల మండల కేంద్రం నుంచి విస్నూర్ వరకు PWD డబుల్ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు.  దేవరుప్పుల మండలం సీతారాంపురంలో కస్టమ్ హైరింగ్ సెంట, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ, సింగరాజుపల్లి నుంచి జీడికల్ వరకు డబుల్ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఇప్పటి వరకు కేంద్రానికి మనం ఇచ్చిన దాంట్లో సగం కూడా తిరిగి మనకు ఇవ్వలేదన్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు అందులో ఒకరు మంత్రి కూడా..అయినా వాళ్లు రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పోరాడరని విమర్శించారు. వాళ్లు కేంద్రం నుంచి ఏదో ఇస్తున్నట్టు...తెస్తున్నట్లు తెగ పోజులు కొడుతున్నారు. కేంద్రం నుంచి ఏం ఇప్పించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ వాళ్ల ప్రగల్భాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. వాళ్ల నిజ స్వరూపం త్వరలో బయటపడుతుందన్నారు. 


కరోనా కారణంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో మన రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందన్నారు. బీజేపీ తీరు మరీ విడ్డూరంగా ఉందన్నారు. మద్దతు ధర ఎక్కువ పెట్టొద్దట. కేంద్రం నిర్ణయించిన దానికంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేయ బోమని FCI అంటున్నది. రైతుల పంటలను కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ అంటున్నారు. ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిజ స్వరూపమని దుయ్యబట్టారు. అన్నదాతల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉందామన్నారు.