గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 00:17:17

కార్పొరేట్‌ దొంగల కోసమే బీజేపీ

కార్పొరేట్‌ దొంగల కోసమే బీజేపీ

  • కేంద్రం ఒక్కప్రాజెక్టు కట్టిందా? 
  • బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా జీహెచ్‌ఎంసీ ఓటర్లు 
  • నగర అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ఎజెండా 
  • మీడియాతో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నివర్గాలను అక్కున చేర్చుకొని ఆర్థికంగా, సామాజికంగా ఆయావర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషిచేస్తుంటే.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు ఎర్ర తివాచీ పరచి వారి అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ దేశం లో రైతుల్ని ఆదుకున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు. మోదీ సర్కారు కార్పొరేట్‌ పెద్దల కోసం రెండు లక్షల యాభైవేల కోట్లు మాఫీ చేసిందని ఆరోపించారు. శనివారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇతర పార్టీలపై ఆరోపణలు చేయడమే పరమావధిగా బీజేపీ ముందుకు సాగుతుంటే.. టీఆర్‌ఎస్‌ మాత్రమే అభివృద్ధి ఎజెండాతో ప్రజల దగ్గరకు వెళుతున్నదని చెప్పారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల జీతం నుంచి కంట్రిబ్యూటరీ పెన్షన్‌ రూపంలో జమ చేసుకున్న రూ.54 వేల కోట్లను వాడుకొని వారికి తిరిగి ఇవ్వటానికి ప్రధాని మోదీకి మనసు రావడం లేదని విమర్శించారు. తెలంగాణలో పెన్షన్‌ రూపంలో లక్షల మందికి కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దని పేర్కొన్నారు. తల్లిని చంపి బిడ్డకు ప్రాణం పోశారంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సెటైర్లు వేసిన మోదీ, బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని హైదరాబాద్‌లో తిరుగుతారని నిలదీశారు. తాత్కాలిక ఆవేశానికి గురిచేస్తే హైదరాబాద్‌ గడ్డ ఆగం కాదని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గుణపాఠం చెప్తారని ధీమా వ్యక్తం చేశారు. 

జనంలేని జనసేన 

జనం లేని జనసేన పార్టీ.. సైన్యంలేని నాయకుడు పవన్‌ కల్యాణ్‌ అని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ బీజేపీకి మద్దతు ప్రకటించడం అంటేనే వారిమధ్య ఉన్న రహస్య ఎజెండా ఏమి టో అర్థమవుతున్నదన్నారు. జనంలో ఆదరణలేని, నాయకుడిగా పరిపక్వత లేని వ్యక్తి ఎన్నిమాటలు చెప్పినా ప్రజలు నమ్మరని ఎద్దేవాచేశారు. హైదరాబాద్‌ ప్రజలు వివేకంతో ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తిచేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని పొత్తులు పెట్టుకున్న టీఆర్‌ఎస్‌ విజయాన్ని, హైదరాబాద్‌ అభివృద్ధిని ఆపలేరని పేర్కొన్నారు.

ఆరేండ్లలో అంతులేని అభివృద్ధి

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఆరేండ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని నిరంజన్‌రెడ్డి తెలిపారు. వరద బాధితులను ఆదుకుంటుంటే గిట్టని బీజే పీవాళ్లు దానిని ఆపివేయించి పాపం మూటగట్టుకున్నారని అన్నారు. ఎన్నికలు ఉన్నా లేకు న్నా బాధితులను ఆదుకుంటామని చెప్పిన నేత సీఎం కేసీఆర్‌ అని స్పష్టంచేశారు. హైదరాబాద్‌ ప్రజలు మునుపెన్నడూలేని జరుగని అభివృద్ధిని అనుభవిస్తున్నారని వివరించారు.