మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 14:05:56

అసత్య ప్రచారాలతో ప్రజల్ని మోసం చేస్తున్న బీజేపీ

అసత్య ప్రచారాలతో ప్రజల్ని మోసం చేస్తున్న బీజేపీ

హైదరాబాద్‌ : బీజేపీ అబద్ధపు ప్రచారాలతో ప్రజల్ని మోసం చేస్తున్నది. మాయోపాయాలు పన్నుతున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం మీర్‌పేట్ డివిజన్ భరత్ ఫంక్షన్ హాలులో జరిగిన ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సెంటిమెంట్స్‌ని రెచ్చ గొట్టి ప్రయోజనం పొందాలని బీజేపీ పార్టీ చూస్తుందన్నారు. బీజేపీ వల్ల దేశం, రాష్ట్రం నష్టపోతున్న విషయం ప్రజలు గుర్తించాలన్నారు. పన్నులు సహా మనకు రావాల్సిన నిధులను బీజేపీ అధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. అయినా సీఎం కెసీఆర్, మంత్రి కేటీఆర్ ల నేతృత్వంలో హైదరాబాద్ విశ్వ నగరంగా రూపు దిద్దుకుందని పేర్కొన్నారు.అభివృద్ధిని కొనసాగాలంటే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.


కార్పొరేటర్‌గా అవకాశం ఎవరికి వచ్చినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయాలన్నారు. ఇప్పటికే విశ్వ నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నది. టీఆర్‌ఎస్‌కు మరో అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.