శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 04, 2020 , 03:34:24

బీజేపీ బుకాయింపు

బీజేపీ బుకాయింపు
  • రాష్ర్టానికి నిధుల కేటాయింపుపై ఇరకాటం
  • టీఆర్‌ఎస్‌పై మాటలతో ఎదురుదాడి
  • పసుపు బోర్డు వంటి అంశాలపై నోరెత్తని కమలదళం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వరుస ఓటములకు తోడు తాజా కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు లేకపోవడం వంటి అంశాల్లో తెలంగాణలో బీజేపీ ఇరకాటంలో పడింది. కేంద్ర నిధులపై బుకాయింపు చర్యలకు దిగుతున్నది. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ సోమవారం చేసిన విమర్శలను పార్టీ నేతలతోపాటు అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అసెంబ్లీ, స్థానిక ఎన్నికల్లో 98 శాతం సీట్లు సొంతంగా దక్కించుకొన్న టీఆర్‌ఎస్‌పై బీజేపీ అక్కసు వెళ్లగక్కుతున్నది. వరుస ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన బీజేపీ.. నాలుగు ఎంపీ సీట్లను గాలివాటానికి గెలుచుకొని విర్రవీగిం ది. కానీ ఆ తర్వాత వచ్చిన పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లు కర్రుకాల్చి వాత పెట్టడంతో ఆ పార్టీ ఒక్కసారిగా పాతాళానికి దిగజారింది. ఇప్పుడు కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై వివక్ష స్పష్టమైంది. నిజామాబాద్‌ జిల్లా లో ప్రధానాస్త్రం.. బాండ్‌ పేపర్లపై రాసిచ్చిన పసుపు బోర్డు అంశం ఇప్పుడు పువ్వు గుర్తు నేతలను ఇరకాటంలో పడేసింది. విభజన హామీలను నెరవేర్చకపోవడం, పన్నుల వాటా ను తగ్గించడం వంటి అంశాలు బీజేపీ శ్రేణు లు మరింత విసుగు చెందేలాచేశాయి. వీటన్నింటినీ కప్పిపుచ్చుకొనేందుకు బీజేపీ అధికార పార్టీపై విమర్శలదాడికి దిగుతున్నది.


రోజురోజుకు వాడుతున్న కమలం

రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకు బలహీనపడుతున్నట్టు తేటతెల్లమవుతున్నది. 2014లో జరిగిన 55 మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో మొత్తం 1,399 వార్డులకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 122 స్థానాల్లో గెలిచింది. అదే పరిస్థితిని ఇప్పుడు అంచనా వేస్తే గత నెలలో 130 మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో మొత్తం 3,112 వార్డులు, డివిజన్లలో బీజేపీ 300 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కమలం కేవలం ఒకే స్థానానికి పరిమితమైంది. పంచాయతీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నది. పార్లమెంటు ఎన్నికల్లో గుడ్డిగా నాలుగుస్థానాల్లో గెలిచి రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అనే రీతిలో నేతలు ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో వారిస్థానం ఏమిటో ఓటర్లు స్పష్టంగా చెప్పారు.


కేటాయింపులు లేక ఆగమాగం

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో బీజేపీ నేతలు ఆగమాగమయ్యారు. దేశం మెచ్చే పథకాలను అమలుచేస్తున్న తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపించింది. కేంద్ర సహాయ మంత్రి, ఎంపీలు కలిసి నిధులు తీసుకురావడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా బీజేపీ పాలిత రాష్ర్టాలకే నిధులు దారి మళ్లాయి. దీని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక నేతలు అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ర్టానికి నిధులు ఎందుకు రాలేదని అడిగినవారిపై ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రాజెక్టులకు జాతీయహోదాపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీని టార్గెట్‌ చేస్తూ ప్రజల్లో చులకనవుతున్నారు.


పసుపు బోర్డుపై మౌనం

నిజామాబాద్‌ పార్లమెంటు స్థానాన్ని ఎలాగోలా గెలిచిన బీజేపీ ప్రధానంగా పసుపు బోర్డు అంశంపై నేతలు హామీలు గుప్పించారు. గెలిచిన తర్వాత పసుపు బోర్డును తీసుకొస్తామని ఎంపీ అభ్యర్థి లిఖితపూర్వంగా బాండ్‌ పేపర్లు రాసిచ్చారు. కానీ ఇప్పటివరకు ఆ ఊసేలేదు. దీంతో ఇప్పుడు బీజేపీ నేతలను నిలదీసే పరిస్థితి రావడంతో తప్పించుకొనేందుకు సమాధానాలు వెతుక్కుంటున్నారు. మరోవైపు రాజ్యసభసభ్యుడు కే కేశవరావు అంశంపై కూడా బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా మారింది. ఈ విషయాన్ని అనసవరంగా మాట్లాడారంటూ పార్టీలోనే వ్యతిరేకిస్తున్నారు. 2014లోనే సీఎం రమేశ్‌, కేవీపీ, కే కేశవరావు, దేవేందర్‌గౌడ్‌ పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నామని, కేవీపీ, రమేశ్‌లు ఏపీకి, కేకే, దేవేందర్‌గౌడ్‌ తెలంగాణకు కేటాయిస్తూ గెజిట్‌ కూడా విడుదలచేసినట్టు కేకే ఎస్‌ఈసీకి సమగ్రంగా వివరించారు. దీనిపై ఎస్‌ఈసీ కూడా క్లియరెన్స్‌ ఇచ్చింది. కానీ ఈ అంశాన్ని ఇప్పుడు మాట్లాడటం, కేకేతో తప్పుడు ఓటు వేయించారని ఆరోపణలు చేయడంపై విమర్శలకు తావిస్తున్నది. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీతో ఎలా కలుస్తారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ రాష్ట్ర నేతలపై మండిపడ్డారు. బహిరంగంగా విమర్శలుచేశారు. బీజేపీలో కూడా అదే పరిస్థితి నెలకొన్నది.


రాష్ట్ర పథకాలపై తప్పుడు ప్రచారం

మిషన్‌ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొన్నాయి. కేంద్రం కూడా రైతుబంధు తరహాలో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజనను చేపట్టింది. కాగా, బీజేపీ కేంద్రం లో అమలుచేస్తున్న పథకాలను ఇక్కడ కాపీ కొడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపణలు చేయడంపై ప్రజలు, టీఆర్‌ఎస్‌ శ్రేణు లు మండిపడుతున్నారు. ఇలా ఇలాంటి తప్పుడు ప్రచారంతో బీజేపీ నేతలు అటు పార్టీలో ఇటు ప్రజల్లో చులకనవుతున్నారు.


logo