శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 03:21:03

బీజేపీకి సిద్ధాంతమే లేదు

బీజేపీకి సిద్ధాంతమే లేదు

  • అబద్ధ్దాలతో రాద్ధ్దాంతం
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు గుణపాఠం
  • టీఆర్‌ఎస్‌ బూత్‌స్థాయి  సమావేశంలో మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ‘చెప్పిన అబద్ధ్దాలనే మళ్లీ చెబుతూ బీజేపీ రాద్ధాంతపు ఓట్ల రాజకీయం చేస్తున్నది. ఆ పార్టీకి ఓ సిద్ధ్దాంతం అంటూ లేకుండా పోయింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పాలి’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా పటాన్‌చెరులోని జీఎంఆర్‌ కన్వెన్షన్‌లో భారతీనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరు డివిజన్ల టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల బూత్‌ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీజేపీ గోబెల్స్‌ ప్రచారాన్ని పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు అనగానే కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రజలు గుర్తుకు వస్తారని మండిపడ్డారు. అధికారంలో ఉండగా ఏం చేశాయని ఆ పార్టీలకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారని తెలిపారు. మూడు డివిజన్ల పరిధిలో ఇంటింటికీ నీటి సరఫరాకు ప్రభుత్వం రూ.251 కోట్లు వెచ్చిందని మంత్రి వెల్లడించారు. కోతలు లేని నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అవుతుండటంతో తెలంగాణలో ఇప్పుడు ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లకు పనిలేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో వారంలో మూడు రోజులు పవర్‌ హాలిడే ఉండేదని, ఈ క్రమంలో పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడిన సందర్భాలను మంత్రి గుర్తుచేశారు. 

కొత్త పరిశ్రమలకు నెలవు పటాన్‌చెరు..

పటాన్‌చెరు పరిశ్రమల స్థాపనకు నెలవుగా మారిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇటీవలి కాలంలోనే పటాన్‌చెరు ప్రాంతంలో ఇండస్ట్ట్రియల్‌ పార్క్‌, సుల్తాన్‌పూర్‌లో మెడికల్‌ డివైజ్‌ పార్క్‌, ఉస్మాన్‌నగర్‌లో 250 ఎకరాల్లో ఐటీ పార్క్‌, శివానగర్‌లో ఎల్‌ఈడీ పార్క్‌లు వచ్చాయన్నారు. ఈ పరిశ్రమల ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిల హయాంలో పటాన్‌చెరు భూములు అమ్ముకున్నారు తప్ప, కనీసం ఒక మార్కెట్‌ ఏర్పాటు చేయించలేకపోయారని విమర్శించారు. రూ.180 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిలో రూ.10 కోట్లు వెచ్చించి తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన మార్కెట్‌ యార్డు నిర్మించిందన్నారు. డబుల్‌ బెడ్రూం ఇండ్లలో స్థానికులకు 10 శాతం కేటాయిస్తామని, పటాన్‌చెరు వాసులకు 4వేల ఇండ్లు అందుతాయని హామీ ఇచ్చారు. జీవో 58, 59 కింద పటాన్‌చెరులో 6 వేల మంది పేదలకు ఇండ్ల పట్టాలిచ్చామని చెప్పారు. కరోనాను దృష్టిలో పెట్టుకుని 50 శాతం పన్ను తగ్గించి సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రజలకు ఊరట కల్పించారన్నారు.

హైదరాబాద్‌ ప్రజలకు వ్యాక్సిన్‌ ఇవ్వరా?

కరోనాతో కూడా బీజేపీ ఎన్నికల రాజకీయం చేస్తున్నదని మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. బీహార్‌ ఎన్నికల్లో గెలువడానికి ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని ప్రచారం చేశారని, తెలంగాణ ప్రజలు, హైదరాబాద్‌ ప్రజలకు వ్యాక్సిన్‌ ఎందుకివ్వరని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. సమావేశంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, పటాన్‌చెరు, అందోల్‌ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, ఫారూఖ్‌ హుస్సేన్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, చింతా ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.