శనివారం 23 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 00:48:19

కాషాయ చార్జ్‌షీట్‌ అబద్ధాల పుట్ట

కాషాయ చార్జ్‌షీట్‌ అబద్ధాల పుట్ట

  • కండ్లుండీ చూడలేని కాషాయ పార్టీ నాయకులు
  • హామీల అమలులో ముందున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
  • ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కమలనాథులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎన్నికలు లేనప్పుడు హైదరాబాద్‌ అభివృద్ధి గురించి మాట్లాడరు.. ఓట్లప్పుడు మాత్రం నోటికి ఏది వస్తే అది, అస్యత్యాలు, అర్ధసత్యాలతో ఓటర్లను బురిడీకొట్టించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తారు. ఒక్కటి కాదు.. రెండు కాదు వేల కోట్లతో తెలంగాణ ప్రభుత్వం దేశాన్ని ఆశ్చర్యపరిచేలా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తుంటే.. ఓట్ల కోసం బీజేపీ నేతలు ఇక్కడ అసలు అభివృద్ధే జరుగలేదని మాట్లాడుతున్నారు. ఇటీవల చార్జ్‌షీట్‌ పేరుతో ఓ ఎన్నికల నాటకానికి తెరలేపారు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ నిజాలు నిగ్గుతేల్చే ప్రయత్నం చేస్తే.. అసలు బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ఆడినట్టుగా తేలింది. బీజేపీ చార్జ్‌షీట్‌ పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నది. హామీల అమలుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంటే.. అభివృద్ధిని పట్టించుకోకుండా తప్పుదోవ పట్టించాలన్న కుట్ర బీజేపీ చార్జ్‌షీట్‌లో కనిపిస్తున్నది.  

చార్జ్‌షీట్‌- వాస్తవ నివేదిక

గ్లోబల్‌ సిటీ అని చెప్పి వరదల నగరంచేశారు.

వాస్తవం: మెర్సర్స్‌ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ ర్యాంకింగ్స్‌లో వరుసగా ఆరోసారి హైదరాబాద్‌ అత్యుత్తమ ర్యాంకుల్లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పుణెతో కలిసి 143వ ర్యాంకును       హైదరాబాద్‌ సొంతంచేసుకున్నది. ప్రపంచంలో నివాసయోగ్యమైన అద్భుత నగరాల్లో ఒకటిగా నిలిచింది. కేంద్రమంత్రులు కూడా అనేకసార్లు ఇదే విషయం చెప్పారు. 

సీఎం కేసీఆర్‌ లక్ష ఉద్యోగాల హామీ ఇచ్చి.. ఉద్యోగాలు కల్పించలేదు.

వాస్తవం: టీఎస్‌ఐపాస్‌తో 13,803 కంపెనీలు రాష్ట్రంలో రూ.2.04 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాయి. వీటితో ప్రైవేటురంగంలో 14.48 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. కొవిడ్‌ సమయంలోనూ రూ.6,066 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అమెజాన్‌ రూ.20,761 కోట్లు పెట్టుబడులు పెట్టగా, నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ.500 కోట్లు పెట్టుబడులు పెట్టింది. టీఎస్‌పీఎస్సీతోపాటు వివిధ బోర్డుల ద్వారా 1.20 లక్షలకుపైగా ఉద్యోగులను నియమించింది.

లక్ష ఇండ్లు నిర్మిస్తామన్నారు. కేంద్ర నిధులతో ఈ పథకం చేపట్టి.. పేరు మార్చారు.

వాస్తవం: ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజనను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేయడం లేదని స్వయంగా కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ఆవాస్‌ యోజన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్నదన్న బీజేపీ నాయకుల ఆరోపణలు నిజంకాదని కేంద్ర మంత్రి ప్రెస్‌మీట్‌ ద్వారా స్పష్టమవుతున్నది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఒకట్రెండు నెలల్లోనే వీటిని పేద ప్రజలకు అందజేయనున్నారు.

హుస్సేన్‌సాగర్‌ను శుద్ధజలాలతో నింపుతామన్నారు.

వాస్తవం: హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ బోర్డు హుస్సేన్‌సాగర్‌ పరిధిలో కొత్తగా 17 సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను నిర్మిస్తున్నది. 376.5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో వీటిని చేపడుతున్నారు. దీనికి సంబంధించి సెప్టెంబర్‌ 11న ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం రూ.512 కోట్లు మంజూరుచేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 1,280 కోట్లు. అంటే దాదాపు 40 శాతం నిధులను ఇప్పటికే విడుదలచేసింది. పనులన్నీ చకచకా సాగుతున్నాయి.  

15 డంపింగ్‌ యార్డులు నిర్మిస్తామని చెప్పి ఒక్కటి కూడా సిద్ధంచేయలేదు.

వాస్తవం: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛసర్వేక్షణ్‌ పథకంలో వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ రాజధానిగా హైదరాబాద్‌ నిలిచింది. జవహర్‌నగర్‌ ఒక్కటే గతంలో ఉండేది. ఇప్పుడు నగరానికి నలువైపులా అధునాతన డంపింగ్‌ యార్డులు ఏర్పాటుచేస్తున్నారు. దీనికి సంబంధించిన స్థల సేకరణ పూర్తికావడంతోపాటు పునర్‌ వినియోగ పద్ధతిలో చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుల్లో విద్యుత్‌ను తయారు చేస్తున్నాం. నెల రోజుల క్రితమే చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే రాంకీ ప్లాంటు కూడా ప్రారంభమైంది.

వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.

వాస్తవం: వరదల కారణంగా నష్టపోయినవారి సహాయార్థం రూ.1,350 కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ప్రధానమంత్రి మోదీకి లేఖరాశారు. నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం సైతం రాష్ట్రం లో పర్యటించింది. ఇప్పటివరకు ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. ముఖ్యమం త్రి కేసీఆర్‌ వరద సహాయ చర్యల కోసం రూ.664 కోట్లు విడుదలచేశారు. 6.64 లక్షల కుటుంబాలకు రూ.10 వేల చొప్పు న ఆర్థికసాయం అందజేశారు. ఈ అంశం పై ప్రతిపక్షాలు ఎస్‌ఈసీకి ఫిర్యాదుచేసి సాయం పంపిణీని నిలిపివేయించాయి.

ఆయుష్మాన్‌ భారత్‌లో కొవిడ్‌- 19 కవరేజీ ఉన్నది. ఆరోగ్యశ్రీలో లేదు.

వాస్తవం: తెలంగాణలో కొవిడ్‌ బాధితుల రికవరీ రేటు 95.28 శాతానికి చేరుకున్నది. ఇది జాతీయ సగటు 93.7 శాతం కంటే ఎక్కువ. రాష్ట్రంలోని సర్కారు దవాఖానల్లో వసతులను భారీగా మెరుగుపరిచింది. ప్రత్యేక కొవిడ్‌ దవాఖానలను ఏర్పాటుచేసింది. ఢిల్లీ తబ్లిగీ జమాత్‌ వల్ల వైరస్‌ వ్యాప్తి జరుగుతున్నదని మొదట కేంద్రాన్ని అప్రమత్తం చేసిందే తెలంగాణ. ప్రతిపక్షాలు ఒత్తిడి వల్ల ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్‌ చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రైవేటులో అధిక బిల్లులు వేయకుండా ఆంక్షలు విధించింది. ఏ రకంగా చూసినా ఆయుష్మాన్‌ భారత్‌ కన్నా తెలంగాణ అమలుచేస్తున్న ఆరోగ్యశ్రీ వందరెట్లు మంచి పథకం. ఆయుష్మాన్‌ భారత్‌లో ఉన్న పరిమితులు ఆరోగ్యశ్రీలో లేవు.

రాష్ట్ర అప్పులు భారీగా పెరిగాయి.

వాస్తవం: 2020 జూన్‌ ముగింపునాటికి మొదటిసారి కేంద్ర ప్రభుత్వ అప్పు రూ. 100 లక్షల కోట్లను దాటింది. 2020-21 నాటికి తెలంగాణ అప్పు రూ.2.29 లక్షల కోట్లు అవుతుందని అంచనా. 2012-13, 2019-20 మధ్యకాలంలో తెలంగాణ తలసరి ఆదాయం 12.2 శాతం వృద్ధిచెందగా.. దేశం తలసరి ఆదాయం 9.9 శాతమే వృద్ధిచెందింది. పరిమితులకు లోబడే తెలంగాణ అప్పులు చేసింది. ఇదే విషయాన్ని ఆర్బీఐ, నీతిఅయోగ్‌, ఫైనాన్స్‌ కమిషన్లు తమ నివేదికల్లో చెప్పాయి.  

ఎల్‌ఆర్‌ఎస్‌ కుంభకోణం. ఆస్తివిలువ కంటే ఎక్కువ చార్జీలు చెల్లించాలి.

వాస్తవం: అక్రమ లేఅవుట్లలోని రిజిస్టర్డ్‌ ప్లాట్లను మాత్రమే రెగ్యులరైజ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేసినప్పుడు ఉన్న రిజిస్ట్రేషన్‌ విలువపైనే చార్జీలు ఉంటాయి. కొన్ని రాష్ర్టాల్లో ప్రస్తుత రిజిస్ట్రేషన్‌ విలువపై రెగ్యులరైజేషన్‌ చార్జీలు వసూలుచేస్తున్నారు. ముమ్మాటికీ ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రజలకు ఉపయోకరమైన పథకం. దీనివల్ల యజమానులకు లాభాలే ఎక్కువ.

కొత్త పార్కుల అభివృద్ధి జరుగలేదు.

వాస్తవం: పచ్చదనం విషయంలో కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్‌జవదేకర్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. గత డిసెంబర్‌లో అన్ని రాష్ర్టాల అటవీశాఖల మంత్రులతో నిర్వహించిన భేటీలో హరితహారాన్ని కేంద్రమంత్రి మెచ్చుకున్నారు. రాష్ట్రంలో పచ్చదనం 33శాతానికి చేరుకున్నదని కేంద్రమంత్రే చెప్పారు.


logo