శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 12:40:23

మానవాళికి మార్గదర్శకం భగవద్గీత : ఎమ్మెల్సీ కవిత

మానవాళికి మార్గదర్శకం భగవద్గీత : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌ : నిత్యం గీతా పఠనం చేయడం ద్వారా ‌జీవితంలో సన్మార్గంలో పయనిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చిక్కడపల్లిలోని‌ త్యాగరాయ గానసభలో జరిగిన ‘గీతాజయంతి మహోత్సవం’లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ముందుగా గో మాతను పూజించిన ఎమ్మెల్సీ కవిత, భారతీయ సంస్కృతిలో గో పూజకు ఎంతో విశిష్టత ఉందన్నారు. భగవద్గీతలోని ‌ఎన్నో‌ సూక్ష్మమైన, ఆధ్యాత్మికమైన అంశాలను వివరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు.

 ప్రపంచంలో ఎన్ని గ్రంథాలున్నా గీతకు మాత్రమే ‌జయంతి నిర్వహిస్తారని కవిత గుర్తు చేశారు. శ్రీ కృష్ణుడు స్వయంగా ఇచ్చిన గీతా సందేశం తర తరాలకు మంచి మార్గాలను బోధిస్తుందన్నారు.  జీవితంలో మనం చేసిన ప్రతి పనికి ఫలితం ఉంటుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.


  ప్రతి ఒక్కరు నిత్యం గీత పఠనం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, మహా సహస్ర అవధాని డా.గరికపాటి ‌నరసింహారావు, టీఆర్ఎస్ నేత దేవీ ప్రసాద్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ శ్రీధర్, త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా వి.ఎస్ జనార్థన్ మూర్తి, సామాజికవేత్తలు డా.విజయ్ కుమార్, డా.రేగొండ ‌సురేష్ పాల్గొన్నారు.


logo