బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 23, 2020 , 17:12:08

రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

ఖమ్మం : రైతును రాజు చేయటమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం మధిర మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం  కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని,  రైతు బంధు, రైతు బీమా, సాగుకు నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్‌, రాయితీపై విత్తనాలు, ఎరువులు అందిస్తూ అన్నదాతలకు అన్నివిధాలా అండగా నిలుస్తున్నదని అన్నారు.

రైతు బంధు పథకం ద్వారా  ఏడాదికి రైతులకు రూ.15 వేల కోట్ల ఇస్తున్నామని తెలిపారు. ఈ ఈ పథకాన్నీ ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసించిందని గుర్తుచేశారు. సాగుకు నిరంతర విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో రైతులు నరకం చూశారని అందుకే ఆ పార్టీని తిరస్కరించారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ కనుమరుగవుతుందని, ఆ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం సాగునీటి  ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నదని లక్ష ఎకరాలకు సాగునీరందించడమే సీఎం సంకల్పమని స్పష్టం చేశారు.

అంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చిత్తారు నాగేశ్వరరావుతోపాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు,  టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాత మధు , టీఆర్‌ఎస్‌ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, జిల్లా రైతు సమన్వయ సమితి నల్లమల వెంకటేశ్వరరావు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు దొండపాటి వెంకటేశ్వరరావు , డైరెక్టర్ ఐలూరు వెంకటేశ్వర్ రెడ్డి ,మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత , వైస్ చైర్‌ పర్సన్ శీలం విద్యా లత , మండల, పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాస రావు, దేవిశెట్టి రంగారావు, కనుమూరి వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ మండలాల అధ్యక్షులు కార్యదర్శులు, మున్సిపల్ కౌన్సిలర్లు, రైతు బంధు సమితి మండల కన్వీనర్లు జిల్లా కమిటీ సభ్యులు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, సొసైటీ అధ్యక్షులు డైరెక్టర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.