సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 19:11:18

సుప‌రిపాల‌న అందించ‌డ‌మే సీఎం కేసీఆర్ ల‌క్ష్యం

సుప‌రిపాల‌న అందించ‌డ‌మే సీఎం కేసీఆర్ ల‌క్ష్యం

హైద‌రాబాద్ : రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగా ప‌రిపాల‌న వికేంద్రిక‌ర‌ణ చేశార‌ని పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.  బుద్ధ భ‌వ‌న్ లోమంగ‌ళ‌వారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలపై అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్  సమీక్ష నిర్వహించారు. 

పురపాలక సంఘాల పరిధిలోని పట్టణాల్లో రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస అవసరాలపై ప్రధాన దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్‌.. ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు.  మున్సిపాలిటీల‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నులు, చేప‌ట్టాల్సిన కార్యక్రమాలపై కేటీఆర్ సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మున్సిపాలిటీల అభివృద్ధికి ఓ అభివృద్ధి నమూనాను తయారు చేసుకోవాల‌న్నారు. దీని ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పురపాలన కొనసాగాలని చెప్పారు. రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, ప‌చ్చ‌దనం వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. కొత్త పురపాలక చట్టం నిర్దేశించిన విధులను ఖ‌చ్చితంగా అమలు చేయాలన్నారు.  

పారిశుద్ద కార్మికులకు స‌కాలంలో జీతంలో చెల్లించాల‌న్నారు. వారికి అవసరమైన దుస్తులు, బూట్లు, మాస్క్‌లు ఆయా మున్సిపాలిటీలే అందించాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్ ఉండేలా లక్ష్యంతో పని చేయాలన్నారు. ఇందులో 50 శాతం షీ టాయిలెట్లు ఉండాలన్నారు.  ప్రతి మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ఉదయం 5.30 గంటలకే ఫీల్డ్‌లో ఉండాలని, స‌ర్ ఫ్రైజ్ విజ‌ట్ చేయాల‌ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

స‌మావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ వెంక‌టేష్ నేత‌, ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోణ‌ప్ప , దివాక‌ర్ రావు, దుర్గం చిన్నయ్య , విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయ‌క్, పుర‌పాల‌క శాఖ ముఖ్య కార్యదర్శి  అర్వింద్ కుమార్, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్  డైరెక్టర్ సత్యనారాయ‌ణ‌, కలెక్టర్లు ముషారఫ్ అలీ ఫారూఖీ, సిక్తా ప‌ట్నాయ‌క్, భారతీ హోళికేరి, సందీప్ కుమార్ ఝా, మున్సిపల్ చైర్మన్ లు, పురపాలక శాఖ‌ కమిషనర్లు హాజరయ్యారు.


logo