మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 01:52:55

తెలంగాణ అర్చకుల సంక్షేమమే లక్ష్యం

తెలంగాణ అర్చకుల సంక్షేమమే లక్ష్యం

వరంగల్‌ చౌరస్తా: రాష్ట్రంలోని అర్చకుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ అర్చక ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పని చేస్తున్నదని సమితి రాష్ట్ర అధ్యక్షుడు కనకంభట్ల వెంకటేశ్వరశర్మ, కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్‌ నగరంలోని మట్టెవాడ భోగేశ్వరాలయంలో సమితి ద్వితీయ వార్షికోత్సవ మహాసభకు అన్ని జిల్లాల నుంచి అర్చకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరశర్మ, ఉపేంద్రశర్మలు మాట్లాడుతూ.. 2015లో 577 జీవో ద్వారా 5,625 మంది అర్చకులకు ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనాలు అందించేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలిచ్చినా దేవాదాయశాఖ అధికారులు స్పందించడం లేదన్నారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు తీర్మానం చేశారు. గ్రామీణ ప్రాంతాల అర్చకులకు జీవో నంబర్‌ 179, 249 ప్రకారం ఆలయ పరిధి పెంచాలని, రూ.6 వేల వేతనం అందించాలని, దూపదీప నైవేధ్యం పథకం అమలు చేస్తున్న ఆలయాల అర్చకులకు రూ.10 వేల వేతనం అందించాలని కోరారు. అనంతరం సమితి కొత్త అధ్యక్షుడిగా కనకంభట్ల వెంకటేశ్వరశర్మ, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా గంగు ఉపేంద్రశర్మ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా చిన్నం మోహన్‌, ప్రధాన కార్యదర్శిగా బేతి కేశవ, వరంగల్‌ జిల్లా అర్చకుల సంఘం అధ్యక్షుడిగా ఏనుగుల అనిల్‌శర్మ, ఉద్యోగుల సంఘం వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా ఆర్‌ సంజీవరావును ఎన్నుకున్నట్లు ప్రతినిధులు తెలిపారు.