ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 23, 2020 , 01:31:39

బీజేపీ మక్కజిత్తులు

బీజేపీ మక్కజిత్తులు

  • కేంద్రం నిర్ణయానికి విరుద్ధంగా రాష్ట్ర నేతల వ్యవహారం
  • కొనుగోలు కోసం ధర్నాల నాటకాలు

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకోవచ్చంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్‌లో చట్టం చేసినప్పటికీ ఆ పార్టీ రాష్ట్ర నేతలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ శ్రేణులు గురువారం కామారెడ్డి జిల్లాలో హంగామా చేశారు. కలెక్టరేట్‌ ఎదుట, 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. తమ ప్రభుత్వం చేసిన చట్టాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన నేతలు వారితోనే చట్టానికి విరుద్ధంగా మహాధర్నా నిర్వహించారు. తెలంగాణ సహా పలు రాష్ర్టాల్లో మక్కజొన్న దిగుబడి భారీగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల మక్కల దిగుమతిపై ఉన్న పరిమితిని సడలించింది. 

రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకోవచ్చంటూ వ్యవసాయ మార్కెట్ల అవసరం లేకుండా చట్టం చేసింది. ఇందుకు భిన్నంగా బీజేపీ జిల్లా, రాష్ట్ర నేతలు రైతులను మభ్యపెడుతూ ఆందోళనలు చేపడుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత సెప్టెంబర్‌లో మోదీ సర్కార్‌ ఆమోదించిన మూడు చట్టాలు రైతులకు వ్యతిరేకమైనవని, కార్పొరేట్‌ శక్తులకు లాభం చేకూర్చేవిగా ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. పంట ఉత్పత్తులను రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చనే స్వేచ్ఛ కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను నామమాత్రం చేసింది. అయినప్పటికీ బీజేపీ నాయకులే మక్కజొన్న పంటను రాష్ట్ర ప్రబుత్వమే కొనుగోలు చేయాలంటూ గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు కేంద్ర చట్టాలను స్వాగతిస్తూ సంబురాలు చేసుకున్న నాయకులు మరోవైపు తమ స్వార్థ రాజకీయాల కోసం రైతులను మభ్యపెడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. 

నిజానికి వానకాలం సాగుకు ముందే మక్కజొన్న విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులను అప్రమత్తం చేశారు. మక్కజొన్నకు డిమాండ్‌ తగ్గుతున్న నేపథ్యంలో రైతులు ఆ పంట వేయొద్దని సూచించారు. దేశంలో తొమ్మిది రాష్ర్టాల్లో మక్కజొన్న అవసరానికి మించి సాగుచేయడంతో డిమాండ్‌ పడిపోయింది. దీంతో క్వింటాలు మక్కల ధర రూ.1100 నుంచి రూ.1200 మధ్యనే పలుకుతున్నది. దీనికితోడు మోదీ ప్రభుత్వం మక్కల దిగుమతిపై ఆంక్షలు సడలించడం రైతులకు శరాఘాతంగా మారింది. మక్కలపై దిగుమతి సుంకాన్ని 50 శాతం ఉంచి 15 శాతానికి తగ్గించింది.