బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 15:35:37

హైదరాబాద్‌ అల్లర్లపై ఓ రచయిత్రి అంతరంగం

హైదరాబాద్‌ అల్లర్లపై ఓ రచయిత్రి అంతరంగం

హైదరాబాద్‌ : నాకెందుకో 1990,1991,1992 సంవత్సరాలు పదే పదే గుర్తుకొస్తునాయ్. ఆ సమయంలో మేం బాగ్ లింగంపల్లిలో ఎంఐజీ 23 లో ఉండేవాళ్లం. గజ్జల మల్లారెడ్డి  ఫ్లాట్‌లో అద్దెకుండేవాళ్లం. నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు హైదరాబాద్‌లో భయంకరమైన మతకల్లోలాలు జరిగాయి. తీవ్రమైన మత ఉద్రిక్తతలు సృష్టించి రాజకీయలాభం పొందాలనుకునే రాజకీయ నాయకులు ఆ సంవత్సరం ఎంతోమంది మరణాలకు కారకులయ్యారు.

మర్రిచెన్నారెడ్డి ముఖ్య మంత్రి గా ఉన్నాడు. ముఖ్యమంత్రి మార్పు కోసం భయానకమైన మతకలహాలు సృష్టించారని అందరికీ అర్థమైంది. మామూలుగా పాతనగరంలోనే మతకలహాలు జరిగినప్పుడు కర్ఫ్యూ పెడతారు. కర్ఫ్యూ కాటు ఎలా ఉంటుందో అక్కడి ప్రజల జీవితాలను కర్ఫ్యూ  ఎలా అతలాకుతలం చేస్తుందో మూసీకి ఇవతలున్న వారికి కూడా అర్థమైన సందర్భం. మేమున్న బాగ్‌లింగంపల్లిలో కూడా కర్ఫ్యూ పడగనీడ కమ్ముకున్నప్పుడు అందరం ఎలా గిలగిల లాడామో నాకు బాగా గుర్తు. మా ఇంటి కింద  వెంకటయ్య అనే ఆయన టిఫిన్ సెంటర్ ఉండేది. వందలాది మంది అక్కడికొచ్చి టిఫిన్స్ తినేవారు. ముఖ్యంగా సింగిల్‌గా ఉండేవాళ్ల తిండికి ఆ బండే ఆధారం.

హోటళ్లతో పాటు అలాంటి టిఫిన్ సెంటర్‌లు మూతబడ్డాయి. వెంకటయ్య రహస్యంగా ఇంట్లో అన్నం వండి ఆకలికి నకనకలాడుతున్నవాళ్లకి ఎలా అందచేశాడో నాకు తెలుసు. అన్నింటికీ మించి అర్ధరాత్రిళ్లు పోలీసుల హడావుడికి నిద్రపట్టేది కాదు. అన్నింటికన్నా భయంకరమైన అనుభవం నిశ్శబ్దంగా ఉండే రాత్రి వేళ ఆడియోల్లో వినిపించే అరుపులు, కేకలు, హృదయవిదారకంగా ఏడ్చే ఏడుపులు గజగజ వణికించేవి. చాలా దుర్మార్గంగా ఇలాంటి ఆడియో కేసెట్లను ఆటోల్లోనో, బైక్ల మీదో తిరుతుగూ పెద్ద వాల్యూంతో వినిపించడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తేవి.

నాకిప్పటికీ ఆ శబ్దాలు వినబడుతున్నట్టే ఉంటుంది. ఒక వర్గం వారిని టార్గెట్ చేస్తూ ద్వేషం వెళ్లగక్కుతూ మాట్లాడిన మాటలు గుర్తొస్తున్నాయి. కనీసం వారం రోజులపాటు ఈ మతకల్లోలం అనుభవించాం. కర్ఫ్యూ అంటే ఏమిటో ఎంత భయానకంగా ఉంటుందో మూసికివతల నగరానికి కూడా అనుభవంలోకి వచ్చింది.  ఎవరు ఈ కల్లోలం స్రుష్టించాడో వాళ్లు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ 400 మంది ప్రాణాలు కోల్పోవడమో,శాశ్వత అంగ వైకల్యం పొందడమో జరిగిన విషాదాన్ని ఎలా మర్చిపోతాం. హైదరాబాద్‌ ప్రజలు ప్రేమని, ప్రశాంతతని కోరుకుంటారు.

కానీ రాజకీయనాయకులు ఉచ్చుపన్ని విద్వేషాన్ని మండిస్తారు. తమ స్వార్ధం కోసం హైదరాబాద్ ప్రశాంతతని తాకట్టు పెట్టి పబ్బం గడుపుకుంటారు. దానికి మంచి ఉదాహరణ 1990 నాటి మత కల్లోలం. ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది. అప్పటి తరం మారింది. ఈ తరం యువత ఆలోచనలు అభ్యుదయంగా ఉండడం వల్లనే ఎలాంటి అవాంచనీయ ఘటనలు లేకుండా హాయిగా ఉంటున్నాం. ఇదిగో ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ రాజకీయ నాయకుల నోట్లోంచి మతకలహాలు అనే పదం వినిపిస్తోంది. ఆ పదమే భయం రేకెత్తిస్తున్నది.

పెద్ద నోట్ల బందుతో నష్టపోయారు సామాన్య ప్రజలు. కరోనాతో సవాలక్ష సమస్యల్లో కుములుతున్న ప్రజలు పని లేక ఆదాయం లేక ఉద్యోగాలు కోల్పోయి జీవన్మరణ పోరాటం చేస్తుంటే నువ్వు మతాన్ని, మత అసహనాన్ని ముందుకు తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడడం క్షమించరాని ద్రోహం. హైదరాబాద్ ప్రజలూ బహు పరాక్.మత విద్వేషాన్ని రెచ్చగొట్టే గద్దలు నగరం మీద వాలుతున్నాయి. అమాయకపు కోడిపిల్లల్ని ఎగరేసుకుపోవాలని కుట్రలు పన్నుతున్నాయి. ప్రేమ పునాదుల మీద నిలబడిన హైదరాబాద్ మీద మీ ద్వేషపు చూపులు పడనీయం. ప్రేమే గెలుస్తుంది.

                                                                                                                                                                                                                    -కొండవీటి సత్యవతి, ప్రముఖ రచయిత్రి


logo