గురువారం 28 జనవరి 2021
Telangana - Oct 27, 2020 , 02:49:08

ఆ డబ్బు రఘునందన్‌దే..

ఆ డబ్బు రఘునందన్‌దే..

  • బీజేపీ అభ్యర్థి బంధువు ఇంట్లో రూ. 18.67లక్షలు స్వాధీనం
  • పోలీసులపైకి దూసుకువచ్చి రూ.12.80 లక్షలను లాక్కెళ్లిన అనుచరులు
  • ఘటనకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు 
  • సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ 

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువు ఇంట్లో పోలీసులు సోమవారం 18.67 లక్షలు స్వాధీనం చేసుకున్నారని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ తెలిపారు. డబ్బును తరలిస్తున్న సమయంలో బీజేపీ నేతలు గుంపుగా వచ్చి పోలీసుల చేతులనుంచి 12.80లక్షలు లాక్కెళ్లారని వెల్లడించారు. ఘటన మొత్తాన్ని వీడియో రికార్డు చేశామని, ఘటనకు పాల్పడినవారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సిద్దిపేటలో మూడు చోట్ల పోలీసులు, రెవెన్యూ అధికారులు సోమవారం నిర్వహించిన సోదాలపై సీపీ జోయల్‌ డెవిస్‌ మీడియాకు వివరించారు. ‘పట్టణంలోని టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సుతోపాటు మరో ఇద్దరు సురభి రామ్‌గోపాల్‌రావు, సురభి అంజన్‌రావు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు బంధువు అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షలు పట్టుబడ్డాయి. అంజన్‌రావుకు ఈ డబ్బును రఘునందన్‌రావు బంధువు జితేందర్‌రావు తన డ్రైవర్‌ ద్వారా పంపించారు. స్వాధీనం చేసుకున్న డబ్బుపై పంచనామా చేసే సమయంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుతోపాటు ఆయన అనుచరులు 250 మంది వరకు అక్కడ గుమిగూడారు. పెద్ద నినాదాలు చేస్తుండటంతో అధికారులు బయటకు వచ్చారు. వారిని చూడగానే 30 మంది గుంపు దూసుకువచ్చి అక్కడున్న పోలీసుల నుంచి డబ్బును లాక్కెళ్లారు. 

ఈ తతంగమంతా వీడియోలో రికార్డయ్యింది. రూ. 18.67 లక్షల్లో 12.80 లక్షలు ఎత్తుకెళ్లగా మిగతా డబ్బు 5.87లక్షలు సీజ్‌ అయ్యింది. డబ్బు లాక్కెళ్లిన సంఘటన పూర్తిగా వీడియోలో రికార్డయ్యింది.. లాక్కెళ్లిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి’ అని సీపీ డెవిస్‌ చెప్పారు. సోదాల్లో సిద్దిపేట తహసీల్దార్‌ విజయ్‌ పాల్గొన్నట్లు తెలిపారు. ప్రాథమికంగా వివరాలు తీసుకున్నాక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ సమక్షంలో ఆ డబ్బును సీజ్‌ చేశామని వెల్లడించారు. సోదాలు, అక్కడ చోటుచేసుకున్న సంఘటనలు అన్నీ వీడియో రికార్డు చేసినట్లు చెప్పారు. జితేందర్‌ అనే వ్యక్తి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు వరుసకు బామ్మర్తి అవుతాడని.. అల్వాల్‌ నుంచి ఆ డబ్బులను అంజన్‌రావు ఇంటికి పంపించారని తెలిపారు. అయితే, ‘ఆ డబ్బులు నావి కావు.. వాళ్లు పంపించినవే. ఆ డబ్బు కు నాకు సంబంధం లేదు’ అని అంజన్‌రావు స్టేట్‌మెంట్‌ ఇచ్చారని సీపీ చెప్పారు.


logo