బుధవారం 03 జూన్ 2020
Telangana - May 01, 2020 , 21:32:52

థానే టు వనపర్తి.. కాలినడకన కార్మికులు

థానే టు వనపర్తి.. కాలినడకన కార్మికులు

వనపర్తి : మేం చాలా రోజుల నుంచి మహారాష్ట్రలోని థానే జిల్లాలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. కరోనా నేపథ్యంతో లాక్‌డౌన్‌ విధించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేరే రాష్ర్టాల వలస కూలీలకు రూ.500లు, బియ్యం పంపిణీ చేశారు. కానీ మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం వేరే రాష్ట్రల కూలీలను పట్టించుకున్న పాపాన పోలేదని వనపర్తి జిల్లా చినగుంటపల్లి, పడమటి తండాకు కాలినడకన వెళ్తున్న పలువురు శుక్రవారం భూత్పూరులో ‘నమస్తే తెలంగాణ’తో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారం రోజులుగా తాము పాదయాత్రగా గ్రామాలకు బయలుదేరామని తెలిపారు. 

మేం మళ్లీ మన ప్రాంతానికి వస్తామనుకోలేదు

మేం మహారాష్ట్రలో థానా జిల్లాలోని ఇమ్మడి తాలూకా కాలేరు గ్రామంలో దాదాపు నాలుగేళ్ల నుంచి ఉంటురన్నాం. కరోనా నేపథ్యంలో అక్కడి పరిస్థితులను చూసి తట్టుకోలేక సొంతూళ్లకు బయలుదేరాం. వాహనాలు లేకపోవడంతో కాలినడక తప్పదని బయలుదేరాం. మధ్యమధ్యలో కొన్ని లారీలు, కంటేనర్ల వాళ్లు చూసి తీసుకొని వచ్చారు. అక్కడకక్కడ నడుచుకుంటూ వచ్చాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వలస కూలీలను దేవుడిలా ఆదరిస్తూ ఆదుకున్నారని వేరే ప్రాంతాల వాళ్లు మాతో చెప్పారు. అందుకే సొంతూళ్లకు బయలుదేరాం. మార్గ మాధ్యంలో మాకు పోలీసులు, ఆరోగ్య సిబ్బంది స్పందించి సహకరించారు.

- శివనాయక్‌, చినగుంటపల్లి, వనపర్తి జిల్లా
logo