ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 13, 2020 , 01:49:52

గిరిజన భాషల్లోనే వాచకాలు

గిరిజన భాషల్లోనే వాచకాలు

  • రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయోగం
  • బంజార, కోయ, గోండి, కొలామి 
  • భాషల్లో పుస్తకాల ప్రచురణ
  • పుస్తకాల ప్రచురణకు ప్రత్యేక చర్యలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గిరిజన తెగల చిన్నారులు తెలుగుతోపాటు ప్రత్యేకంగా ఉండే తమ తెగలకు సంబంధించిన భాషల్లోనూ చదువుకునేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రాథమిక విద్యను పటిష్ఠం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,426 గిరిజన పాఠశాలలను నెలకొల్పి గిరిజన విద్యార్థులు తమ మాతృభాషలోనే చదువుకునేందుకు 2020-21 విద్యా సంవత్సరానికిగాను వాచకాలను రూపొందించింది. గిరిజనులకు మాతృభాషలోనే ప్రాథమిక విద్యను అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆలోచన మేరకు గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా సంస్థ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. 

ఇందుకుగాను ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు కొలామి వాచకం, గోండి వాచకం, బంజార వాచకం, కోయ వాచకాలను ఈ విద్యాసంవత్సరానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. మాతృభాషలో బోధనతో విద్యార్థులు ఉత్సాహవంతంగా చదువుతారు. పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం గిరిజన చిన్నారులు భాషా అవరోధాన్ని అధిగమించేందుకు ప్రత్యేకంగా గిరిజన భాష వాచకాలు రూపొందించారు. ఈ వాచకం ద్వారా ఒకటో తరగతిలో నేర్చుకున్న భాషా నైపుణ్యాలను ఒకటవ పాఠంలో పునశ్చరణ చేసి, తక్కిన పాఠాల్లో విద్యార్థి పఠన, లేఖన, శ్రవణ నైపుణ్యాలను పెంపొందించడానికి అవసరమైన గిరిజన ఇతివృత్తాలు ఎంచుకొని ఆసక్తికరంగా తయారుచేశారు. 

2019-20లో ప్రయోగాత్మకంగా బంజారా, గొండి, కోయ, కొలామి భాషల్లో చిన్న పదాలతో పుస్తకాలను రూపొందించి ఆయా పాఠ్య పుస్తకాలతోపాటు తమ భాషకు సంబంధించిన పదాలను నేర్చుకునేలా దృష్టి పెట్టారు. 2020-21 విద్యాసంవత్సరం కోసం పూర్తిస్థాయిలో ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు గిరిజన భాషల్లో వాచకాలను తయారుచేసి అందుబాటులోకి తెచ్చారు. ఈ వాచకాల్లో పదజాలం, చిత్రాలు గిరిజన విద్యార్థులు తమ ఇంట్లో రోజూ ఉపయోగించే అంశాల గూర్చి ఉండటం వల్ల తేలికగా అర్థం చేసుకోగలుగుతారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను పాఠ్యాంశాల్లో పెట్టడంతో వారి సంస్కృతిని కాపాడుకోగలుగుతారు. గిరిజన భాషలోని పాఠాలను ఉపాధ్యాయులు తెలుగు భాషలో బోధించేందుకు వీలుగా ప్రతి గిరిజన భాషా వాచకం వెనుక భాగంలో క్లుప్తంగా తెలుగులో పాఠాలను పొందుపరిచారు.


logo