బుధవారం 03 జూన్ 2020
Telangana - May 07, 2020 , 01:42:14

కార్మిక క్షేత్రంలో సాంచాల సప్పుళ్లు

కార్మిక క్షేత్రంలో సాంచాల సప్పుళ్లు

  • 40 రోజుల తర్వాత సిరిసిల్లలో మరమగ్గాల సందడి
  • పండుగ వాతావరణంలో వస్త్ర ఉత్పత్తులు  
  • సంతోషంలో వేలాది మంది కార్మికులు

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ సిరిసిల్ల రూరల్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూగబోయిన కార్మికక్షేత్రంలో మళ్లీ సాంచాల సప్పుళ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర సర్కారు లాక్‌డౌన్‌ సడలింపు ఇవ్వడంతో దాదాపు 40 రోజులు దాటిన తర్వాత తిరిగి మరమగ్గాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 2 నుంచి రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్‌టైల్‌ పార్క్‌లో పరిశ్రమలు నడుస్తుండగా, బుధవారం సిరిసిల్ల, చంద్రంపేట, తంగళ్లపల్లి గ్రామాల్లో వస్త్ర ఉత్పత్తులు మొదలయ్యాయి. దాదాపు 40 వేల సాంచాల్లో 60శాతానికిపైగా నడుస్తున్నాయి. ప్రస్తుతం బతుకమ్మ చీరలు, విద్యార్థుల యూనిఫాం వస్ర్తాలు ఉత్పత్తవుతున్నాయి. మరమగ్గాలతోపాటు వార్పిన్లు, డైయింగ్‌లు, సైజింగ్‌లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు తెరుచుకున్నాయి. దీంతో వేలాది మంది నేతన్నలు సంతోషంగా పనుల్లో చేరారు. ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపు మేరకు కరోనా నివారణ చర్యలు పాటిస్తూ రాత్‌ పైలీ, దిన్‌పైలీ చేస్తున్నారు. నేటి నుంచి పూర్తిస్థాయిలో మరమగ్గాలు నడిపిస్తామని వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూతపడ్డ పరిశ్రమను తెరిపించి నేతన్నలకు ఉపాధి కల్పించినందుకు వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం గౌరవ అధ్యక్షుడు జిందం చక్రపాణి మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సర్కారుకు రుణపడి ఉంటం..

మాది మెదక్‌జిల్లా నిజాంపేట. పని కోసం రెండేండ్ల కింద కుటుంబంతో సిరిసిల్లకు వచ్చి సాంచాలు నడిపిస్తున్న. లాక్‌డౌన్‌తో నెలన్నర సంది సాంచాలు బందున్నయ్‌. ఇంటి కిరాయి కట్టలేక, పొట్టగడుసుడు తిప్పలైంది. మా గోస సూసి మంత్రి కేటీఆర్‌ సారు సాంచాలు చాలు చేయించిండు. షానా సంతోషంగా ఉంది. సారుకు రుణపడి ఉంటం.  

- తర్రె రాజేశం, కార్మికుడు (మెదక్‌ జిల్లా)

మా బతుకంతా సాంచాలపైనే..

మా బతుకంతా సాంచాలపైనే. పొద్దంత కండెలు చుడ్తె వచ్చే కూలిపైనే కుటుంబాన్ని ఎల్లదీత్తున్న. కేటీఆర్‌ సార్‌ దయవల్లనే మా సిరిసిల్లకు మంచిరోజులు అచ్చినయ్‌. సాంచాలకు సావులేదు. లాక్‌డౌన్‌తో పనిలేకుండాపోయింది. మా గోస పట్టించుకున్న మంత్రి మళ్లీ సాంచాలు చాలు చేయించి ఆదుకున్నడు.

- పాముల మమత,కండెలు చుట్టే కార్మికురాలు (సిరిసిల్ల)


logo