ఆదివారం 31 మే 2020
Telangana - May 01, 2020 , 06:35:18

నేటినుంచి తంగళ్లపల్లిలో సాంచాలు ప్రారంభం

నేటినుంచి తంగళ్లపల్లిలో సాంచాలు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల : లాక్‌డౌన్‌ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలోని టెక్స్‌టైల్‌ పార్క్‌ను మినహాయించారు. దీంతో శుక్రవారం నుంచి సాంచాలు ప్రారంభం కానుండగా, సుమారు వెయ్యిమంది నేత కార్మికులకు ఊరట లభించనున్నది. సారంపల్లిలోని టెక్స్‌టైల్‌ పార్క్‌లో 90 యూనిట్లకు గాను 1,300 మరమగ్గాలపై వెయ్యి మంది నేత కార్మికులు ఉపాధి పొందుతున్నారు. అందులోనూ ఎక్కువ శాతం బీహార్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తోపాటు స్థానిక కార్మికులు ఉన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులు సొంత గ్రామాలకు వెళ్లలేక, స్థానికంగా ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో పార్క్‌ పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉండటంతోపాటు, ప్రతి యూనిట్లో ఇద్దరు లేక నలుగురు కార్మికులు మాత్రమే పనిచేస్తున్నందున మే ఒకటి నుంచి యూనిట్లు ప్రారంభించుకోవాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అనుమతిచ్చినట్టు టెక్స్‌టైల్‌ పార్క్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ అనిల్‌ వెల్లడించారు. అయితే కార్మికులు సామాజిక దూరం పాటించేలా చూడటంతోపాటు, వారికి మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని అధికారులు, యజమానులకు కలెక్టర్‌ ఆదేశించారు. నిబంధనలు పాటించకపోతే యూనిట్లను మూసివేస్తామని హెచ్చరించారు. ఇదిలావుండగా సిరిసిల్ల పట్టణంలోని మరమగ్గాలకు ఇంకా అనుమతి రాలేదు. logo