సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 01:40:51

2కోట్లతో వస్త్రవ్యాపారి పరారీ

2కోట్లతో వస్త్రవ్యాపారి పరారీ

  • యాదగిరిగుట్ట పట్టణవాసుల ఆందోళన

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: స్థానికుల వద్ద దాదాపు రూ.2 కోట్ల వరకు వసూలు చేసిన ఓ వ్యాపారి ఉడాయించిన ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం వెలుగుచూసింది. బాధితుల కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన రామస్వామి 25 ఏండ్ల కింద యాదగిరిగుట్టకు వచ్చి వస్త్ర వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాడు. ఆయన వస్త్ర దుకాణంలో అర్జున్‌, పళని అనే వ్యక్తులు పనిచేసేవారు. వీరికి రామస్వామి తన కూతుళ్లను ఇచ్చి వివాహం చేశారు. అందరితో కలివిడిగా ఉంటూ వ్యాపారం చేసేవారు.  నమ్మకంగా ఉంటూ 2014 లో అర్జున్‌ స్థానికుల వద్ద సుమారు రూ.50 లక్షల వరకు అప్పు చేసి ఉడాయించాడు. అతని ఆచూకీ కోసం చాలారోజులు వెతికినా లభించలేదు. రామస్వామి కూడా అప్పట్లోనే వెళ్లిపోయాడు. 

ఇదిలావుండగా యాదగిరిగుట్టలోనే పళని కుటుంబం మాత్రమే ఉంటుంది. పళని కూడా స్థానికుల వద్ద వడ్డీకి సుమారు రూ.2 కోట్ల వరకు వసూలు చేసి నెలరోజుల క్రితం కుటుంబసభ్యులతో కలిసి తమిళనాడుకు పరారయ్యాడు. వ్యాపారంలో భాగంగా తమిళనాడు వెళ్లిన పళని తిరిగివస్తాడని భావించిన బాధితులకు నిరాశే మిగిలింది. యాదగిరిగుట్ట పట్టణంలో పళనికి అప్పు ఇచ్చినవారు ఎంత మంది ఉన్నారో వివరాలు సేకరిస్తున్నట్టు స్థానికుడు గౌలికార్‌అశోక్‌ తెలిపారు. సుమారు 25 మందికిపైగా అప్పు ఇచ్చినవారిని గుర్తించామని, వీరిసంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదన్నారు. ఒకే ఇంట్లో భార్యకు తెలియకుండా భర్త వద్ద, భర్తకు తెలియకుండా భార్య వద్ద పళని అప్పు తీసుకున్నట్టు తెలిసిందన్నారు. కాగా, యాదగిరిగుట్ట సీఐ పాండురంగారెడ్డిని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.


logo