బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 03:35:20

దేశ సగటును మించి టెస్టులు

దేశ సగటును మించి టెస్టులు

  • ప్రతి 10 లక్షల జనాభాలో 542 పరీక్షలు
  • డబ్ల్యూహెచ్‌వో సూచించింది 140 మాత్రమే
  • రాష్ట్రంలో 5 లక్షలు దాటిన నిర్ధారణ పరీక్షలు
  • రాబోయే రోజుల్లో నిత్యం 25 వేల టెస్టులు
  • 7 లక్షల ర్యాపిడ్‌ కిట్లకు సర్కారు ఏర్పాట్లు
  • 10 నుంచి 30కి పెరుగనున్న మొబైల్‌ ల్యాబ్స్‌

రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు దేశ సగటును మించి జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి 10 లక్షల జనాభాలో 140 టెస్టులుచేయాలని సూచించగా, తెలంగాణలో 542 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదే దేశంలో 479 నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు ఇప్పటికే 5 లక్షలు దాటిపోయాయి. ప్రస్తుతం రోజుకు సగటున 18 వేల పరీక్షలుచేస్తుండగా, రాబోయే రోజుల్లో నిత్యం 25 వేల పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తున్నది. ఇప్పుడున్న 10 మొబైల్‌ ల్యాబ్స్‌ను 30కి పెంచేందుకు కసరత్తుచేస్తున్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నిర్ధారణ పరీక్షల్లో తెలంగాణ దూసుకుపోతున్నది. ప్రజల్లో భయాన్ని పోగొట్టి భరోసా ఇచ్చేందుకు అవసరమైన ప్రతి ఒక్కరికీ పరీక్షలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 16 ప్రభుత్వ, 23 ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ, జిల్లా దవాఖానల్లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు మొబైల్స్‌ ల్యాబ్స్‌ ఏర్పాటుచేసి కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో విస్తృతంగా పరీక్షలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో నిర్ధారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది. 

దేశ సగటు కంటే ఎక్కువగా..

గత వారం రోజులుగా రాష్ట్రంలో ప్రతిరోజు దాదాపు 18 వేలవరకు నిర్ధారణ పరీక్షలుచేస్తున్నారు. దీంతో సోమవారం నాటికి రాష్ట్రంలో పరీక్షల సంఖ్య 5 లక్షల మార్కును దాటింది. వివిధ రాష్ర్టాల కంటే మన తెలంగాణలో జరుగుతున్న పరీక్షల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రతి 10 లక్షల మందిలో దేశంలో 479 పరీక్షలు నిర్వహిస్తుండగా, తెలంగాణలో అంతకుమించి 542 పరీక్షలు చేస్తున్నారు. అత్యధిక పరీక్షలు చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ 7వ స్థానంలో ఉండగా, ఇంతకంటే తక్కువగా స్థానాల్లో ఢిల్లీ, పుదుచ్చేరి, బీహార్‌, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా, పశ్చిమ బెంగాల్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఉన్నాయి. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచన ప్రకారం ప్రతి 10 లక్షల మందిలో 140 మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించగా, మన దేశంలో 28 రాష్ర్టాలు ఈ నిబంధన మేరకు నడుచుకుంటున్నాయి. తెలంగాణలో డబ్ల్యూహెచ్‌వో సూచించిన దానికంటే నాలుగు రెట్లకుపైగా పరీక్షలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. రాబోయే రోజుల్లో నిత్యం 25 వేల పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. దీనికోసం అవసరమైన ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ కిట్లను సమకూర్చుకుంటున్నది. మొత్తం 7 లక్షల ర్యాపిడ్‌ కిట్లను సమకూర్చుకునేందుకు ఏర్పాట్లుచేసింది. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న 10 మొబైల్‌ ల్యాబ్స్‌ సంఖ్యను 30కి పెంచేందుకు కసరత్తుచేస్తున్నది.

ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షలు

డబ్ల్యూహెచ్‌వో సూచించింది
140
భారత్‌లో జరుగుతున్నవి 
479
తెలంగాణలో నిర్వహిస్తున్నవి 
542


వారం రోజులుగా రాష్ట్రంలో నిర్వహించిన టెస్టులు

తేదీ
పరీక్షలు
04-08-2020
13,787
03-08-2020
9,443
02-08-2020
19,202
01-08-2020
21,011
31-07-2020
21,380
30-07-2020
18,263
29-07-2020
18,858


తాజావార్తలు


logo