ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 24, 2020 , 01:23:22

నేటి నుంచి సీసీఎంబీలో పరీక్షలు

నేటి నుంచి సీసీఎంబీలో పరీక్షలు

  • రోజుకు 500కుపైగా శాంపిళ్లు పరీక్షించే సామర్థ్యం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లోని సీసీఎంబీ (సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ)లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. పరీక్షల కోసం అత్యాధునికమైన 12 రియల్‌ టైమ్‌ పీసీఆర్‌లను సిద్ధం చేసినట్టు సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా సోమవారం ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు. కరోనా పరీక్షలను నిర్వహించడానికి 20 మంది నిపుణులను నియమించినట్టు తెలిపారు. జీవ శాస్త్రం(లైఫ్‌ సైన్సెస్‌) పరిశోధనల్లో అగ్రస్థానంలో ఉన్న సీసీఎంబీని కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు వేదికగా వాడుకోవడానికి అవకాశమివ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. పరీక్షల నిర్వహణకు తమకు కేంద్రం నుంచి లిఖిత పూర్వకంగా అనుమతి లభించిందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా తెలిపారు. కరోనా నిర్ధారణ పరీక్షలకు తాము సర్వ సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మంగళవారం నుంచి నమూనాలను పంపితే తాము పరీక్షలను నిర్వహిస్తామని గాంధీ, ఉస్మానియా దవాఖానల వైద్యాధికారులకు సమాచారమిచ్చారు. రోజుకు 500కుపైగా నమూనాలను పరిశీలించే సామర్థ్యం సీసీఎంబీకి ఉన్నది.logo