ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 01:39:27

‘పది’ పరీక్షలపై నేడు నిర్ణయం

‘పది’ పరీక్షలపై నేడు నిర్ణయం

  • తేల్చనున్న హైకోర్టు.. ఉత్కంఠలో విద్యార్థులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి తలపెట్టిన పదోతరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతున్నది. ఇప్పటికే గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలమేరకు పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు కొవిడ్‌-19 వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పదోతరగతి పరీక్షలు నిలిపివేయాలని దాఖలైన పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం హైకోర్టు విచారణ ప్రారంభించింది. దీనిపై శుక్రవారం తుది నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పరీక్షల సందర్భంగా కొవిడ్‌ నిబంధనలన్నింటినీ పాటిస్తున్నామని ఎస్‌ఎస్‌సీ బోర్డు హైకోర్టుకు తెలియజేసినప్పటికీ.. తుది నిర్ణయం వెలువడేదాకా ఈ సందిగ్ధత కొనసాగనున్నది. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు, తల్లిదండ్రుల సంఘాలు.. పది పరీక్షలను రద్దుచేయడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు. పదో తరగతిలో ఇంటర్నల్స్‌, సమ్మెటివ్‌, అసైన్‌మెంట్లు, ప్రీఫైనల్‌ పరీక్షలను కొలమానం చేసుకొని పది ఫలితాలను విడుదలచేయాలని కోరుతున్నారు. ఈ మేరకు డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రఘుశంకర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

పరీక్షల నిర్వహణకు సర్వంసిద్ధం: అడ్వకేట్‌ జనరల్‌

ఈ నెల 8 నుంచి పదోతరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధంచేశామని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హైకోర్టుకు నివేదించారు. పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని విజ్ఞప్తిచేశారు. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు నిలిపేయాలని దాఖలైన పిటిషన్లపై  హైకోర్టు ధర్మాసనం గురువారం మరోమారు విచారణ చేపట్టింది. కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడానికే మొగ్గు చూపుతున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు గత ఆదేశాలను అనుసరిస్తూ జూన్‌ 8 నుంచి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. కొవిడ్‌-19 మార్గదర్శకాలను పాటించేలా పరీక్ష కేంద్రాలను దాదాపు రెట్టింపుచేశామని తెలిపారు.

మిగిలిన 8 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా ఇప్పటికే విడుదలచేసి విద్యార్థులకు తెలియజేశామని వివరించారు గతంలో ఉన్న 2,530 కేంద్రాలను 4,535కు పెంచామని, థర్మల్‌ స్క్రీనింగ్‌ కిట్లు, మాస్కులను సేకరించి సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. కేంద్రానికి ఒక్కరు చొప్పున 4,535 మంది మెడికల్‌ సిబ్బందిని నియమించామని, డీఈవో కార్యాలయాల్లో ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాలను పరీక్షల ప్రారంభానికి ముందే శానిటైజ్‌ చేస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సులు, ట్యాక్సీలు ప్రారంభమైనందున రవాణా ఇబ్బంది లేదన్నారు. విద్యార్థుల మధ్య ఆరడుగుల భౌతికదూరం పాటిస్తూ, బెంచీకి ఒకే విద్యార్థి కేటాయిస్తున్నామని తెలిపారు. కంటైన్మెంట్‌ జోన్లలో పరీక్ష కేంద్రాలు లేకుండా చర్యలు తీసుకొన్నామని చెప్పారు. వాదనలు నమోదుచేసుకొన్న ధర్మాసనం.. శుక్రవారం నిర్ణయం తీసుకుంటామంటూ విచారణను వాయిదా వేసింది.


logo