శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 02:46:08

రేపటి నుంచి పది పరీక్షలు

రేపటి నుంచి పది పరీక్షలు

-గంట ముందే పరీక్ష కేంద్రాలకు 

-హాజరుకానున్న 5.34 లక్షల మంది 

-2,350 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు  

-దగ్గు, జలుబు ఉన్నవారికి ప్రత్యేక గదిలో పరీక్షలు

-అన్ని కేంద్రాలలో శానిటైజర్లు 

-సమీక్షలో మంత్రి సబితాఇంద్రారెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి ఏప్రిల్‌ 6 వరకు నిర్వహించనున్న పదోతరగతి పరీక్షలకు విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో హాజరుకావాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు. పదోతరగతి పరీక్షల నిర్వహణపై మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పదోతరగతి పరీక్షలకు రాష్ట్రంలో 5,34,903 మంది విద్యార్థులు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. వీరిలో బాలురు 2,73,971, బాలికలు 2,60,932 మంది ఉన్నారని చెప్పారు.  పరీక్షలకు 5,09,079 రెగ్యులర్‌, 25,824 ప్రైవేటు విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,530 పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. 

పది పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమవుతాయని, 8.30 గంటలకే పరీక్షకేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.విద్యార్థులు హాల్‌టికెట్లను www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, ఇప్పటివరకు దాదాపు 4.5 లక్షల మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని వివరించారు. ఎండతీవ్రత దృష్ట్యా పరీక్షకేంద్రాల్లో ఇద్ద రు చొప్పున వైద్యసిబ్బందిని, అవసరమైన ఔషధాలను, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుతున్నట్టు తెలిపా రు. పరీక్షల నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు పరిష్కరించడానికి ప్రభుత్వ పరీక్షల కార్యాలయం, డీఈవో కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌రూం (040-23230942) ఏర్పాటుచేసినట్టు చెప్పారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పరీక్ష వేళకు చేరుకొనేలా సకాలంలో బస్సులను నడుపాలని ఆర్టీసీ అధికారులను, కరంట్‌ కోతలు విధించవద్దని విద్యుత్‌ శాఖాధికారులను కోరినట్టు పేర్కొన్నారు

ప్రత్యేక గదిలో పరీక్షలు

కరోనావైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు దగ్గు, జలుబు ఉన్నట్టయితే ప్రత్యేక గదులు ఏర్పాటుచేస్తున్నట్టు సబిత తెలిపారు. విద్యార్థుల కోసం ప్రతి పరీక్ష కేంద్రంలో శానిటైజర్లు, లిక్విడ్‌ సబ్బులను అందుబాటులో ఉంచుతామన్నారు. విద్యార్థులు మాస్కులు ధరించినా, వాటర్‌బాటిళ్లు తీసుకొచ్చినా అనుమతిస్తామని చెప్పారు. ఇన్విజిలేటర్లను రిజర్వులో ఉంచుతామని, ఎవరైనా అనారోగ్యానికి గురైతే మరొకరిని నియమిస్తామన్నారు. పరీక్షకేంద్రాల్లో గుంపులుగా ఉండకుండా ప్రతిరోజు ఉదయం 8.30 నుంచే లోపలికి అనుమతిస్తామని చెప్పారు.  సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఏ సత్యనారాయణరెడ్డి, అదనపు డైరెక్టర్‌ రమణకుమార్‌, శ్రీహరి పాల్గొన్నారు.

డియర్‌ స్టూడెంట్స్‌

  • ఆల్‌ ది బెస్ట్‌ చెప్పుకొనేందుకు కరచాలనం చేయొద్దు. 
  • పరీక్ష కేంద్రాలకు తల్లిదండ్రుల వాహనాలపై వెళ్లడం ఉత్తమం.
  • జనసమ్మర్ధ ప్రదేశాల్లో వేచి చూడాల్సి వచ్చినప్పుడు నోటికి చేతిరుమాలు లేదా మాస్కు కట్టుకోవాలి.
  • ఒకవేళ టిష్యూను వాడితే.. తర్వాత చెత్తబుట్టలో పడేయాలి. 
  • ఎట్టి పరిస్థితిలోనూ పరీక్ష కేంద్రం వద్ద గుంపులుగా ఉండొద్దు.
  • ఏవైనా అంశాలపై బృంద చర్చలకు దూరంగా ఉండండి. 
  • తప్పనిపరిస్థితిలో పాల్గొనాల్సి వస్తే మాస్కులు ధరించాలి 
  • మిగతావారికి రెండుమీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తపడండి.
  • ఒత్తిడిలో చేతులతో తరచూ ముఖాన్ని రాసుకోవడం చేయొద్దు.
  • చేతులు శుభ్రం చేసుకోకుండా ఆహార పదార్థాలు తీసుకోవద్దు.


logo