సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 23:53:16

తెరుచుకొన్న ఆలయాలు

తెరుచుకొన్న ఆలయాలు

  • సంప్రోక్షణ తర్వాత పూజలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: సూర్యగ్రహణం సందర్భంగా మూసివేసిన ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం తెరిచారు. గ్రహణం ముగిసినవెంటనే సంప్రోక్షణ నిర్వహించి పూజలు చేశారు. అనంతరం భక్తులను అనుమతించారు. యాదాద్రి ఆలయ తలుపులను మధ్యాహ్నం 3:10 గంటలకు తెరిచారు. ఆలయాన్ని శుద్ధిచేసి, మంత్రించిన జలంతో లక్ష్మీనృసింహుడు కొలువుదీరిన ప్రధానాలయం, ఆలయ పరిసరాల్లో  సంప్రోక్షణ జరిపారు. నిర్మల్‌ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని మధ్యాహ్నం రెండుగంటల తరువాత తెరిచి శుద్ధిచేశారు. 

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటలకు తెరిచారు.  భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో  గోదావరి నుంచి తెచ్చిన పుణ్యతీర్థంతో అర్చకులు సంప్రోక్షణ నిర్వహించారు.  తిరుమలలో గ్రహణ అనంతరం ఆలయశుద్ధి, మహా సంప్రోక్షణ, నిత్యకైంకర్యాలను ఏకాతంగా నిర్వహించారు. కాగా, శ్రీకాళహస్తి ఆలయా న్ని గ్రహణ సమయంలోనూ తెరచి ఉంచి మహాలఘు దర్శనాన్ని అమలుచేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరిలో ఆదివారం భక్తులు గ్రహణ విడుపు స్నానాలు ఆచరించారు.  


logo