గురువారం 09 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 02:29:03

నేటి నుంచి ఆలయాల్లో దర్శనాలు

నేటి నుంచి ఆలయాల్లో దర్శనాలు

  • సడలింపులతో సుదీర్ఘకాలం తర్వాత ప్రారంభం 
  • భౌతికదూరం, శానిటైజేషన్‌ తప్పనిసరి

హైదరాబాద్‌,  నమస్తే తెలంగాణ: కంటైన్మెంట్‌ జోన్ల పరిధి మినహా రాష్ట్రంలోని ఆలయాలు భక్తుల దర్శనాల కోసం సిద్ధమయ్యాయి. సోమవారం నుంచి భక్తులకు దైవదర్శనాలు ప్రారంభంకానున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఆదివారం వరకు ఆలయాల్లో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. ఆ సమయంలో అర్చకులు నిరాడంబరంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లాక్‌డౌన్‌ సడలింపులతో ఆలయాల్లో దర్శనం కోసం సోమవారం నుంచి భక్తులకు అనుమతివ్వనున్నాయి. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, పరిసరాలను సోడియం హైపోక్లోరేట్‌ ద్రావణంతో శుభ్రపర్చారు. భక్తులు భౌతికదూరంగా పాటించేలా దేవాదాయ, ధర్మాదాయశాఖ, ఆలయ విభాగాలు ఏర్పాట్లు పూర్తిచేశాయి. యాదాద్రి, భద్రాద్రి, కొమురవెల్లి, బాసర, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, ధర్మపురి నర్సింహస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి, వరంగల్‌ భద్రకాళి, జోగుళాంబ, శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి, ఇతర అన్ని ఆలయాల వద్ద భక్తుల దర్శనం కోసం అన్నీ సిద్ధంచేశారు. భక్తులు భౌతికదూరం పాటి స్తూ దర్శనాలు చేసుకునేలా మూడు అడుగులకు ఒక గడిని (బాక్సు) ఏర్పాటుచేశారు. మాస్కులు ధరిస్తేనే లోపలికి అనుమతివ్వనున్నారు. యాదగిరి గుట్టపై తెల్లవారుజామున 5 గంటలనుంచే దర్శనాలు ప్రారంభమై.. రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్నాయి. తొలిరోజు దర్శనానికి స్థానికులకే అవకాశమిస్తారు. ఆర్జిత సేవలను రద్దుచేశారు. 

నేడు ఉద్యోగులకే వెంకన్న దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో నేటినుంచి దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. ముందుగా నిర్ణయించినట్లు తొలిరోజు టీటీడీ ఉద్యోగులు, రెండోరోజు తిరుమల, తిరుపతిలోని స్థానికులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ప్రయోగాత్మక దర్శనాల్లో లోపాలుంటే సరిచేస్తారు. 11వ తేదీ నుంచి సాధారణ భక్తులను అనుమతించనున్నట్టు టీటీడీ వర్గాలు పేర్కొన్నాయి.

శఠగోపం ఉండదు.. వృద్ధులు రావొద్దు

దైవ దర్శనానికి వచ్చే భక్తుల ఉష్ణోగ్రతను థర్మల్‌ గన్స్‌ ద్వారా పరీక్షిస్తారు.

ప్రవేశ ద్వారాల శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్నాకే ఆలయంలోకి అనుమతిస్తారు. 

ఆలయం వద్ద భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లుచేశారు. 

కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలో దర్శనాలకు రాకూడదు.

కరోనా లక్షణాలున్నవారు, పదేండ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వారిని అనుమతించరు. 

అంతరాలయ దర్శనం, శఠగోపం, తీర్థప్రసాదాల వితరణ, వసతి సౌకర్యాలు ఉండవు. 

భక్తులకు పుష్కరిణిలో స్నానాలు చేసేందుకు అనుమతి లేదు. 

ఆలయాల వద్ద ఉన్న విక్రయ కేంద్రాల ద్వారా ప్రసాదాలు పంపిణీ చేస్తారు.ప్రార్థనా మందిరాలకు టచ్‌ఫ్రీ డిస్పెన్సర్స్‌

  • ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

ప్రార్థనామందిరాలు తెరుచుకోనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని అన్ని దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిల దగ్గర టచ్‌ఫ్రీ డిస్పెన్సర్స్‌ (శానిటైజర్లు చల్లే పరికరాలు) ఏర్పాటు చేయనున్నట్టు ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ 

అసదుద్దీన్‌ ఒవైసీ ఆదివారం ట్విట్టర్‌లో తెలిపారు. మజ్లిస్‌ చారిటీ ఎడ్యుకేషనల్‌ అండ్‌ రిలీఫ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రూ.19.70 లక్షలతో వీటిని హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లోని ప్రార్థనా మందిరాలకు పంపిణీచేస్తామన్నారు.


logo