సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 02:27:55

తెరుచుకున్న ఆలయాలు

తెరుచుకున్న ఆలయాలు

  • 60వేల మందికి దైవదర్శన భాగ్యం 
  • ప్రముఖ క్షేత్రాల్లో 3,234 మందికి..

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాప్తితో 78 రోజులుగా మూతపడిన ఆలయాలు సోమవారం తెరుచుకున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ఉదయం 8.30 గంటల నుంచే భక్తుల సందడి నెలకొన్నది. 60 వేల మందికిపైగా భక్తులు తమ ఇష్టదైవాలను దర్శించుకొని తరించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ వివరాల ప్రకారం రాష్ట్రంలో ముఖ్యమైన 20 పుణ్యక్షేత్రాల్లో 13,234 మంది దైవదర్శనాలు చేసుకున్నారు. ఆలయాల వద్ద శానిటైజర్లను వినియోగించడంతోపాటు భౌతికదూరం పాటించేలా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇతర ప్రార్థనా మందిరాలకు కూడా కేంద్రం అనుమతివ్వడంతో మసీదులు, చర్చిల్లో సైతం వేకువజామున నుంచే సందడి నెలకొన్నది.

 హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లోని మాల్స్‌ తెరుచుకున్నాయి. ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటిస్తూ కొనుగోలు దారులను అనుమతించారు. మాస్కులు ధరించేలా చూడటం, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవడంతోపాటు పరిసరాలను తరుచూ శానిటైజ్‌ చేశారు. లిఫ్ట్‌లలో పరిమిత సంఖ్యలో అనుమతించడంతోపాటు ఎస్కలేటర్లు ఉన్న చోట మెట్టుకు ఒక్కరే ఉండేలా చర్యలు తీసుకున్నారు. రెస్టారెంట్లలో యాభై శాతం సీటింగ్‌ మించకుండా చూశారు. దీంతో తొలిరోజు మాల్స్‌, రెస్టారెంట్లలో వ్యాపారాలు ప్రశాంతంగా సాగాయి. 

కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా...

కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా సోమవారం అన్ని దేవాలయాల్లో భక్తులకు దర్శనాలు కల్పించాం. భక్తులు  భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌లు ధరించి దైవ దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించి దర్శనానికి అనుమతించాం. 

- అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయశాఖ  

 తిరుమలలో దర్శనాల ట్రయల్న్‌ 

తిరుమలలో దర్శనాల ట్రయల్న్‌ సోమవారం ప్రారంభమైంది. రెండు గంటల వ్యవధిలో 1,200 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేయలేదు. ఆలయం బయటి కౌంటర్లలో లడ్డూ ప్రసాదాలను మాత్రం విక్రయించారు. దర్శనాల ట్రయల్న్‌న్రు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. తీర్థ ప్రసాదాల పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు చెప్పారు. మూడు రోజుల అనుభవాలను పరిగణలోకి తీసుకొని రోజువారీ దర్శన టికెట్లను పెంచుతామని తెలిపారు. logo