శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 20:04:21

సోమవారం నుంచి తెరుచుకోనున్న గుడులు

సోమవారం నుంచి తెరుచుకోనున్న గుడులు

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌-1 మార్గదర్శకాలు ప్రకటించడంతో రాష్ట్రంలోని ప్రార్థనా మందిరాలు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో గత రెండు నెలలుగా ప్రార్థనా మందిరాలు మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ కాలంలో అర్చకులు నిరాడంబరంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. భక్తుల కోరిక మేరకు ఆన్‌లైన్‌ పూజలు చేపట్టారు. అయితే, దేవదేవుల దర్శనాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి, గణపతి ఆలయం, తాడ్‌బంద్‌ వీరాంజనేయ స్వామి ఆలయం, హిమాయత్‌నగర్‌ తిరుమల తిరుపతి దేవస్థానం, బిర్లా టెంపుల్‌, జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడి, కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి ఆలయం, సనత్‌నగర్‌ రేణుక ఎల్లమ్మ గుడి, గోల్కొండ జగదాంబికా ఆలయంతోపాటు పలు ప్రార్థనా మందిరాలు కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లతో భక్తులకు సేవలందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆలయాల ప్రవేశాలకు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకొంటున్నారు.  

ఆలయాల్లో ప్రవేశం, వెలుపలి దారులను ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తున్నారు. భౌతిక దూరం ఉండేలా భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతీ భక్తుడు విధిగా ముఖాలకు మాస్క్‌ ధరించాలి. ఆలయంలోకి ప్రవేశించే ముందు సబ్బు లేదా నీటితో పాదాలు, చేతులను శుభ్రపర్చుకునేలా చూడాలి. అనుమానిత వ్యక్తుల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటుచేస్తున్నారు. గర్భగుడిలోకి ప్రవేశాలను నిలిపివేశారు. భక్తులకు తీర్థ, ప్రసాదాలను పంపిణీ చేయకుండా చూస్తున్నారు. ఎవరైనా భక్తుల్లో కొవిడ్‌-19 లక్షణాలు కనిపించినపక్షంలో వెంటనే అధికారులు, పోలీసులకు సమాచారం అందించాలి. వారిని ఇతర భక్తులతో కలువకుండా చూడాలి. కరోనా వైరస్‌ నేపథ్యంలో భక్తులు నిబంధనలను విధిగా పాటించాలని హైదరాబాద్‌ నగర దేవాదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎం రామకృష్ణారావు అన్నారు. 


logo