శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:32:07

పుష్కరిణిల్లో స్నానాలుండవ్‌

పుష్కరిణిల్లో స్నానాలుండవ్‌

  • 8 నుంచి ఆలయాల్లో భక్తులకు దర్శనం
  • శఠగోపం, తీర్థప్రసాదాలు, వసతి సౌకర్యాలు లేవు
  • కంటైన్మెంట్‌ జోన్లలోని గుళ్లలో దర్శనాలుండవు 
  • మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ నెల 8 నుంచి ఆలయాల్లో భక్తులకు దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, పుష్కరిణిల్లో స్నానాలు చేయకూడదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టంచేశారు. గర్భగుడి దర్శనం, శఠగోపం, తీర్థప్రసాదాల వితరణ, వసతి సౌకర్యాలు ఉండవని చెప్పారు. ఆలయాల వద్ద ఉన్న విక్రయ కేంద్రాల ద్వారా ప్రసాదాలు పొందవచ్చని తెలిపారు. భక్తులకు దర్శనాల ఏర్పాట్లపై దేవాదాయశాఖ అధికారులతో మంత్రి శుక్రవారం అరణ్యభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఆలయాల పునఃప్రారంభానికి సంబంధించి స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొటోకాల్‌ (ఎస్‌వోపీ)ను అమలుచేయాలని ఆదేశించారు. 

రాష్ట్రంలోని అన్ని ఆలయాలు తెరిచినా, కంటైన్మెంట్‌ జోన్లలోని ఆలయాల్లో భక్తులకు ప్రవేశం కల్పించబోమని, దర్శనాలకు రావొద్దని సూచించారు. కరోనా లక్షణాలున్నవారు, పదేండ్లలోపు పిల్లలు, 65 ఏండ్లు పైబడినవారు దర్శనాలకు రాకపోవడమే మంచిదని చెప్పారు. భక్తులు విధిగా మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని తెలిపారు. ఆలయాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రవేశ ద్వారాల వద్ద శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. భక్తులు భౌతికదూరం పాటించేలా క్యూలైన్లు ఏర్పాటుచేయాలని చెప్పారు. దర్శనానికి చవ్చే ప్రతి ఒక్కరి శరీర ఉష్ణోగ్రతను పరిశీలించేందుకు థర్మల్‌ స్క్రీనింగ్‌ గన్స్‌, శానిటైజర్లకు సంబంధించి ప్రత్యేక స్టాండ్లను ఏర్పాటుచేస్తామని, అన్ని జాగ్రత్తలతో ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తామని వివరించారు. ప్రముఖ దేవాలయాలకు సంబంధించి ఆన్‌లైన్‌ బుకింగ్‌ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. సమీక్షలో దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


బాసరలో అక్షరాభ్యాసాలు లేవు

బాసర: బాసరలో అక్షరాభ్యాసాలు, కుంకుమార్చన, ఇతర ఆర్జిత సేవాలు ఉండవని ఆలయ ఈవో వినోద్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. ప్రతి రోజు ఉదయం అభిషేక కార్యక్రమాల తర్వాత 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు భక్తుల దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్టు చెప్పారు. క్యూలైన్‌లో భక్తులు భౌతికదూరం పాటించేలా సర్కిళ్లను ఏర్పాటుచేశారు.

11 నుంచి వెంకన్న దర్శనం

కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ దర్శనాలకు అనుమతించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. శుక్రవారం తిరుమలలో శ్రీవారి దర్శన వివరాలను టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ధర్మారెడ్డితో కలిసి మీడియాకు వివరించారు. 

మార్గదర్శకాలు 

ఈ నెల 8,9 తేదీల్లో మొదట టీటీడీ ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా దర్శనం. 10న స్థానికులకు అనుమతి. 11నుం చి సాధారణ భక్తులకు అనుమతి. నిత్యం 7 వేల మంది భక్తులకు దర్శనం. ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు మాత్రమే దర్శనాలు. ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు విఐపీ బ్రేక్‌ దర్శనాలు. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అలిపిరి మెట్ల మార్గంలో భక్తులను అనుమతి. ఘాట్‌ రోడ్డులో ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతి. 65 ఏండ్లు దాటిన వృద్ధులకు, 10 ఏండ్లలోపు పిల్లలను దర్శనానికి రావొద్దు. కంటైన్మెంట్‌ జోన్ల నుంచి భక్తులు తిరుమలకు రావొద్దు. 

ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన భక్తులకు ఆన్‌లైన్‌లోనే గదులు పొందే సౌకర్యం. ఒక గదిలో ఇద్దరు మాత్రమే ఉండాలి. పుష్కరిణిలో స్నానం నిషేధం. కల్యాణకట్టలో ఉద్యోగులకు పీపీఈ కిట్లు. ప్రతి రెండు గంటలకు ఒక సారి క్యూలైన్‌ శుద్ధి. భౌతికదూరం పాటిస్తూ అన్నప్రసాదం. ప్రొటోకాల్‌, వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ దర్శనాలు. లేఖలపై దర్శనాలకు అనుమతి లేదు. మాస్కులు తప్పనిసరి. భౌతికదూరం పాటించాలి. వైరస్‌ ప్రబలే అవకాశం ఉన్నందున శఠారి, తీర్థం ఇవ్వరు. హుండీ వద్దకు వెళ్లేవారికి హెర్బల్‌ శానిటైజేషన్‌ చేస్తారు. తిరుమలలో ప్రైవేట్‌ హోటళ్లకు అనుమతి లేదు.


logo