మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 13, 2020 , 19:19:04

అద్భుత‌మైన ప‌చ్చ‌ద‌నంతో టెంపుల్ సిటీ నిర్మాణం : సీఎం కేసీఆర్‌

అద్భుత‌మైన ప‌చ్చ‌ద‌నంతో టెంపుల్ సిటీ నిర్మాణం : సీఎం కేసీఆర్‌

యాదాద్రి భువనగిరి : అద్భుత‌మైన ప‌చ్చ‌ద‌నంతో యాదాద్రి టెంపుల్ సిటీ నిర్మాణం ఉండాల‌ని రాష్ర్ట ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్‌రావు అన్నారు. ఆధ్యాత్మిక నగరి యాదాద్రిని సీఎం కేసీఆర్ ఆదివారం సందర్శించారు. సీఎం పర్యటన ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగింది. ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడుతుండగా.. లక్ష్మీనరసింహుడి పుణ్యక్షేత్రంలో అణువణువును కలియ తిరుగుతూ సీఎం ఆల‌య‌ అభివృద్ధి పనులను పరిశీలించారు. కోతుల‌కు అర‌టిపండ్లు స్వయంగా అంద‌జేసి మానవతను చాటారు. ఆదివారం ఉదయమే ఆలయానికి చేరుకున్నసీఎం కేసీఆర్‌కు అర్చ‌కులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్రేక పూజలు నిర్వహించారు సీఎం. అనంతరం కేసీఆర్ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణ పనులను అధికారులను, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి, స్థపతి ఆనందచారి వేలును అడిగి తెలుసుకున్నారు. ప్రధాన ఆలయం లోపల, ఆలయ బాహ్య ప్రాకారం, ఆలయ పరిసరాలను అధికారులతో కలిసి సీఎం కలియ తిరిగారు.


ఆలయంలో ఇటీవల చేపట్టిన లైటింగ్ ట్రయల్ రన్‌ను వీడియో ప్రదర్శన ద్వారా తిలకించారు. అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం సీఎం హరిత టూరిజంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప‌నుల నిమిత్తం అధికారుల‌కు పలు సూచనలు చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. యాదాద్రి ఆల‌యానికి రింగ్‌రోడ్డు సుంద‌రీక‌ర‌ణ ఒక మ‌ణిహారంలా తీర్చిదిద్దాల‌న్నారు. ప‌చ్చ‌ని చెట్లు, వీధి దీపాల‌తో వాకింగ్‌, సైక్లింగ్ ట్రాక్‌ల‌తో రింగ్‌రోడ్డును అత్యంత సుంద‌రంగా త‌యారు చేయాల‌న్నారు. ఎంత‌మంది భ‌క్తులు వ‌చ్చినా వారికి సౌక‌ర్యాలు క‌ల్పించే విష‌యంలో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా సౌక‌ర్యాల ఏర్పాట్లు జ‌ర‌గాల‌న్నారు. ఆల‌య ప‌రిస‌రాలు, టెంపుల్ సిటీ నిర్మాణం అద్భుత‌మైన ప‌చ్చ‌ద‌నంతో ఉండాల‌న్నారు. స్పెష‌ల్ ఆర్కిటెక్ట్‌ల‌ను పిలిపించి గండిపేట చెరువు ప్రాంతాన్ని అంద‌మైన స్పాట్‌గా తీర్చిదిద్దాల‌ని చెప్పారు. 365 క్వార్ట‌ర్ల నిర్మాణాన్ని వేగ‌వంతంగా పూర్తిచేయాల‌న్నారు. మ‌రో 200 ఎక‌రాల్లో కాటేజీల నిర్మాణానికి ఏర్పాట్లు చేయాల‌ని తెలిపారు. క‌ల్యాణ‌క‌ట్ట‌, బ‌స్టాండ్‌, పుష్క‌రిణీ రెయిలింగ్‌, ర‌హ‌దారుల ‌నిర్మాణం త్వ‌ర‌గా పూర్తిచేయాల‌న్నారు. బ‌స్టాండ్‌నుంచి గుడి వ‌ర‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించ‌డానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేయాల‌న్నారు. 

ఆల‌య రాజ‌గోపురం, ప్ర‌ధాన ద్వారాల‌కు బంగారు తాప‌డం చేయ‌డానికి పెంబ‌ర్తి నుండి నిపుణులైన స్వ‌ర్ణ‌కారుల‌ను పిలిపించాల‌న్నారు. స‌త్య‌నారాయ‌ణ‌స్వామి వ‌త్రాల‌కు యాదాద్రి ప్ర‌సిద్ధి అన్న సీఎం ఒకేసారి 4 వేల మంది వ్ర‌తం చేసుకునేలా ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఆల‌యం, టెంపుల్ సిటీ నుంచి డ్రైనేజీ నీళ్ల‌ను బ‌య‌ట‌కు పంపేందుకు ప్ర‌త్యేక నిర్మాణాలు చేప‌ట్టాల‌న్నారు. 5 వేల కార్లు, 10 వేల బైక్‌ల కోసం పార్కింగ్ ఏర్పాట్లు సిద్ధం చేయాల‌న్నారు. యాదాద్రి ఆల‌య నిర్మాణ ప‌నుల కోసం మూడు వారాల్లో రూ. 75 కోట్లు విడుద‌ల చేయాల‌ని ఆర్థిక‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిని సీఎం ఆదేశించారు.

తిరుగు ప్రయాణంలో సీఎం కేసీఆర్ యాదాద్రి ఘాట్‌రోడ్డులోని రెండో మలుపు వద్ద కోతుల గుంపును చూశారు. వాహ‌నాన్ని ఆపి దిగి కోతులకు స్వయంగా అరటిపండ్లు అందజేశారు. ఐదేండ్ల క్రితం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు ప్రారంభించిన నాటి నుంచి సీఎం కేసీఆర్‌ యాదాద్రికి రావడం ఇది 13వ సారి. ప్రస్తుతం దేశంలోనే అద్భుత రాతి కట్టడంగా అపురూప శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. logo