గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 02:12:57

తెలుగు టీచర్లు పీవీ చలవే

తెలుగు టీచర్లు పీవీ చలవే

పుట్టిన గడ్డ అంటే ప్రాణం.. మాతృభాష అంటే అభిమానం.. ఉర్దూ వ్యాప్తితో తెలుగుకు పట్టిన తెగులును తొలగించాలన్న కోరిక పీవీలో బలంగా ఉండేది. తెలంగాణలో అప్పటిదాకా నిజాం సంస్థానంలో ఉర్దూకే ప్రాధాన్యం, ఆ తర్వాత ఇంటర్‌ నుంచి అంతా ఆంగ్ల మాధ్యమమే. దీంతో భాష కోసం ఏదైనా గొప్ప పని చేయాలని తీవ్రంగా తపించేవారు. గొప్ప గొప్ప పదవులు చేపట్టినా దక్కని సంతృప్తి తెలుగుకు వన్నె తెస్తే దక్కుతుందని భావించేవారు. ఆ దిశగా వేసిన ఒక అడుగు తెలంగాణలో తెలుగు టీచర్లను పుట్టించింది. తెలంగాణ అంతటా ఈ ప్రాంతానికి చెందిన టీచర్లే పాఠాలు చెప్పే స్థాయికి చేరింది. ఫలితంగా ఆంధ్రా నుంచి ఉపాధ్యాయులను రప్పించుకునే అవసరం లేకుండా పోయింది. వివరాల్లోకెళితే.. అప్పటికి పీవీ విద్యాశాఖమంత్రిగా ఉన్నారు. 

తాను చదువుకున్న రోజుల నుంచి తెలంగాణలో తెలుగు ఆచార్యులు లేరు. తెలుగు బోధించేందుకు ఆంధ్రాప్రాంతం నుంచి 14-15 మంది ఉపాధ్యాయులు గుంపుగా వచ్చేవారు.  దీనికి పరిష్కారం కనుక్కోవాలని తలచిన ఆయన.. ఉస్మానియా యూనివర్సిటీలో ఓరియంటల్‌ డిగ్రీలు ఏర్పాటు చేశారు. ఆ డిగ్రీలు చేసే విద్యార్థులందరికీ రూ.60 స్కాలర్‌షిప్‌ కూడా ఇచ్చేవారు. నాలుగైదేండ్లలో తెలంగాణ అంతటా తెలంగాణకు చెందిన అధ్యాపకులే అయ్యారు. సైలెంట్‌గా పీవీ తెచ్చిన విప్లవం ఇది.logo