శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 01:34:49

రచయిత, జర్నలిస్ట్‌ దేవీప్రియ ఇకలేరు

రచయిత, జర్నలిస్ట్‌ దేవీప్రియ ఇకలేరు

  • అనారోగ్యంతో కన్నుమూత
  • రన్నింగ్‌ కామెంటరీతో ప్రసిద్ధులు
  • గాలిరంగు సంపుటికి కేంద్ర సాహిత్య అవార్డు
  • సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపం

హైదరాబాద్‌,  నమస్తే తెలంగాణ: సాహిత్యం, పత్రికా రంగాల్లో విశేష సేవలందించిన రచయిత, సీనియర్‌ జర్నలిస్ట్‌ దేవీప్రియ(71) కన్ను మూశారు. అనారోగ్యంతో నిమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన దేవీప్రియ అసలు పేరు షేక్‌ ఖాజా హుస్సేన్‌. దేవీప్రియ అనే కలం పేరుతోనే ఆయన ప్రసిద్ధులు. 1970లో ‘పైగంబర కవుల’లలో ఒకరిగా వెలువరించిన ‘గాలిరంగు’ అనే కవితా సంపుటికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన  రచనల్లో అమ్మచెట్టు, నీటి పుట్ట కవితా సంపుటాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. సమకాలీన రాజకీయాలపై కవితాత్మకంగా వ్యాఖ్యానం చేసే పద్ధతిని ఈయన ప్రాచూర్యంలోకి తెచ్చారు. 

ఆంధ్రప్రభ, ఉదయం దినపత్రికల మొదటిపేజీలో పాకెట్‌ కార్టూన్‌ దిగువన రన్నింగ్‌ కామెంటరీ పేరుతో సమకాలీన రాజకీయాలపై ఎనిమిది పొట్టిలైన్ల మినీకవిత రాసేవారు. దానికి ఆర్టిస్ట్‌ మోహన్‌ బొమ్మ వేసేవారు. ఉదయం వీక్లీతో పాటుగా  అనేక దినపత్రికల్లో ఆయన పనిచేశారు. సమాజానందస్వామి పేరుతో పత్రికల్లో వ్యంగ్య వ్యాఖ్యానాలు రాసేవారు. కొన్ని సినిమాలకు పాటలు రాశారు. రంగులకల సినిమాలోని ‘జెమ్‌ జెమ్మల్‌ మర్రీ వెయ్యికాళ్లా జెర్రీ’ పాట ఈయన రాసిందే. దేవీప్రియ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం తిరుమలగిరి శ్మశానవాటికలో నిర్వహించారు.

గాలిరంగు మచ్చుతునక: సీఎం కేసీఆర్‌ సంతాపం

ప్రముఖ కవి దేవీప్రియ మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం తెలిపారు. కవిగా, రచయితగా, కార్టూనిస్ట్‌గా, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని చెప్పారు. దేవీప్రియ సాహిత్య ప్రతిభకు ‘గాలిరంగు’ మచ్చుతునక అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దేవీప్రియ మృతి పట్ల మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, మంత్రి హరీశ్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీనియర్‌ పాత్రికేయులు కే రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్‌, సాహితీవేత్తలు శివారెడ్డి, నందిని సిధారెడ్డి, నాళేశ్వరం శంకరం, సీనియర్‌ జర్నలిస్టులు పాశంయాదగిరి, సైదారెడ్డి, సినీ దర్శకుడు బీ నర్సింగ్‌రావు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్‌, ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ, ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి నరేందర్‌రెడ్డి ఉన్నారు.