ఆదివారం 31 మే 2020
Telangana - May 23, 2020 , 02:19:55

దశలవారీగా సినిమా షూటింగ్‌

దశలవారీగా సినిమా షూటింగ్‌

  • థియేటర్ల ప్రారంభంపై భవిష్యత్‌లో నిర్ణయం
  • తొలుత పోస్ట్‌ ప్రొడక్షన్ల పునరుద్ధరణ.. 
  • లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి
  • సినీ ప్రముఖులతో సీఎం కేసీఆర్‌.. 
  • విధివిధానాలపై అధికారులకు ఆదేశం
  • ముఖ్యమంత్రికి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కృతజ్ఞతలు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌తో ఆగిపోయిన సినిమా షూటింగులు, పోస్ట్‌ ప్రొడక్షన్లను దశలవారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు, కొవిడ్‌ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగ్‌లు నిర్వహించేలా ఎవరికివారు స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందని సూచించారు. షూటింగ్‌లు ఎలా నిర్వహించుకోవాలనే దానిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో సినీరంగ ప్రముఖులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని, థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీరంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేశారు. దీనిపై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. సినీపరిశ్రమపై ఆధారపడి లక్షల మంది జీవిస్తున్నందున పోస్ట్‌ ప్రొడక్షన్‌, షూటింగ్‌ల నిర్వహణ, థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నదని సీఎం అభిప్రాయపడ్డారు. తక్కువ మందితో ఇండోర్‌ లో చేసే వీలున్న పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు మొదట ప్రారంభించుకోవాలని చెప్పారు. ఆ తర్వాత దశలో జూన్‌లో సినిమా షూటింగులు ప్రారంభించాలని సూచించారు. చివరగా పరిస్థితిని బట్టి సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సినీపరిశ్రమ బతకాలని, ఆదే సందర్భంగా కరోనా వ్యాప్తి చెందవద్దన్నారు. అం దుకోసం సినిమా షూటింగ్‌లను వీలైనంత తక్కువ మందితో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణ మార్గదర్శకాలను అనుసరిస్తూ నిర్వహించుకోవాలని చెప్పారు. ఎంత మందితో షూటింగ్‌లు నిర్వహించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని సినీప్రముఖులను సీఎం కోరారు. అనంతరం ప్రభుత్వం కచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి షూటింగ్‌లకు అనుమతి ఇస్తుందని వివరించారు. కొద్దిరోజులు షూటింగ్‌లు నడిచిన తర్వాత అప్పటి పరిస్థితిపై అంచనా వస్తుందని, థియేటర్లు తెరువడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీఎం కేసీఆర్‌తో సమావేశమైనవారిలో మంత్రులు తలసాని, నిరంజన్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డీ సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌, ఎన్‌ శంకర్‌, రాజమౌళి, దిల్‌రాజు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, కిర ణ్‌, రాధాకృష్ణ, కొరటాల శివ, సీ కల్యాణ్‌, మెహర్మ్రేశ్‌, దాము ఉన్నారు.

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: చిరంజీవి

సినీ పరిశ్రమలోని యావన్మంది తరఫున ప్రముఖ నటుడు చిరంజీవి సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ సినిమా, టీవీ, డిజిటల్‌ మీడియాకు సంబంధించిన సమస్యలు సానుకూలంగా విని, వేల మంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారని ట్వీట్‌చేశారు. 


logo