గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 13:16:01

సంజయ్‌ ఎంపీగా కరీంనగర్‌కు ఏం చేశావు? : బాల్క సుమన్‌

సంజయ్‌ ఎంపీగా కరీంనగర్‌కు ఏం చేశావు? : బాల్క సుమన్‌

కరీంనగర్‌ : బీజేపీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీపై టీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో మంగళవారం ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌.. బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. సీఎంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, వారి భాషలోనే సమాధానం చెబుతామన్నారు. ఎంపీగా కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఏం చేశావో చెప్పాలని బండి సంజయ్‌ని డిమాండ్‌ చేశారు. సంజయ్‌కి ఎంపీ పదవి కూడా సీఎం కేసీఆర్‌ పెట్టిన భిక్షేనన్నారు. ఆయన ఉద్యమం చేయకుంటే.. తెలంగాణ రాకుంటే సంజయ్‌కి ఆ పదవి ఎక్కడిదని ప్రశ్నించారు. ఎంపీగా వినోద్‌కుమార్‌ కొత్తపల్లి - మనోహరాబాద్‌ రైల్వేలైన్‌, ట్రిపుల్‌ ఐటీ, జాతీయ రహదారుల కోసం ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ట్రిపుల్‌ ఐటీ రాయచూర్‌కు తరలి పోయిందని, దానికి సంజయ్‌ అసమర్థత కారణం కాదా? అని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, మేయర్‌ సునీల్‌రావు తదితరులు పాల్గొన్నారు.


logo