బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 00:54:00

జమ్ముకశ్మీర్‌ పోలీసుల అదుపులో కుస్తాపూర్‌ యువకుడు

జమ్ముకశ్మీర్‌ పోలీసుల అదుపులో కుస్తాపూర్‌ యువకుడు

జగిత్యాల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ఐఎస్‌ఐ తీవ్రవాదులకు సాయంచేసిన వ్యక్తికి డబ్బులు పంపించాడన్న ఆరోపణలతో జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం కుస్తాపూర్‌కు చెందిన సరికెల లింగన్నను గురువారం తెల్లవారుజామున జమ్ముకశ్మీర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  జమ్ముకశ్మీర్‌లోని అర్నియా పీఎస్‌ పరిధిలోగల ఓ ఆర్మీ క్యాంప్‌లో అదే రాష్ర్టానికి చెందిన రాకేశ్‌కుమార్‌ కూలి పనిచేస్తున్నాడు. అనిత అనే ఐడీ పేరుతో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన వ్యక్తితో రాకేశ్‌కుమార్‌ కొన్నిరోజులు చాటింగ్‌ చేశాడు. తాను జర్నలిస్ట్‌నని.. ఆర్మీ క్యాంప్‌లో ఉన్న వస్తువులు, వాహనాలు, ప్రదేశాల ఫొటోలు పంపితే.. వాటిని వార్తలుగా ఇస్తామని అనిత ఐడీతో ఉన్న వ్యక్తి రాకేశ్‌కుమార్‌ చెప్పాడు. ఇందుకోసం అతని బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.27 వేల నగదు జమ చేశాడు. అనంతరం సైనికుల శిబిరాలు, తదితర వివరాలు, ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఆర్మీ అధికారులు గుర్తించి ఐఎస్‌ఐకు సమాచారం చేరవేస్తున్నాడన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో రాకేశ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతని బ్యాంక్‌ ఖాతాను తనిఖీ చేయగా.. జగిత్యాల జిల్లా కుస్తాపూర్‌ యువకుడు లింగన్న గూగుల్‌ అకౌంట్‌ నుంచి రూ.12 వేలు రాకేశ్‌కుమార్‌ ఖాతాలోకి బదిలీచేసినట్టు గుర్తించి.. విచారణ కోసం అరెస్ట్‌ చేసి తీసుకువెళ్తున్నట్టు అర్నియా ఎస్సై తెలిపారు.  


logo