శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 01, 2020 , 01:50:14

ప్రపంచ దేశాల కంపెనీలు ఇక్కడికి రావాలి

ప్రపంచ దేశాల కంపెనీలు ఇక్కడికి రావాలి

  • కొత్త అవకాశాలకు సిద్ధంకండి
  • కరోనాతో అనేక దేశాలనుంచి తరలిపోనున్న పెట్టుబడులు
  • వాటిని మనం రాబట్టుకోవాలి కార్యాచరణ రూపొందించాలి
  • అధికారులతో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా సంక్షో భం నేపథ్యంలో ప్రపంచంలోని అనేకదేశాలు పెట్టుబడులను తరలించేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఆయా పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యాక రాష్ట్రంలో పారిశ్రామిక కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం బేగంపేట టీ ఫైబర్‌ కార్యాలయంలో ఐటీ, పరిశ్రమలశాఖ అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కంపెనీలతోపాటు.. నూతన పెట్టుబడి అవకాశాలున్న రంగాల్లో వాటిని ఆకర్షించేందుకు మరింత చురుగ్గా పనిచేయాలని చెప్పారు. ఇందుకోసం ఇతర శాఖలతోనూ సమన్వయం చేసుకోవాలని సూచించారు. కరోనా సంక్షోభం క్రమంగా తొలిగిపోతుందని.. నిర్ణీతదూరం, వ్యక్తిగత పరిశుభ్రత మాత్రం కొనసాగుతుందన్నారు. దీంతోపాటు పనిప్రదేశాల్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సిబ్బందిలో మరింత నమ్మకం కలిగించేలా పరిశ్రమలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, టీఎస్‌ఐఐసీ సీఈవో మధుసూదన్‌, ఐటీ విభా గం డైరెక్టర్‌ సుజయ్‌ కారంపూరి, లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తినాగప్పన్‌, ఏవియేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఐటీ సంస్థల్లో స్టాండర్డ్‌ హెల్త్‌కోడ్‌

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఐటీరంగంలోని ఎమ్మెస్‌ఎంఈలను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో సుమారు 6 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని, కరోనా కారణంగా వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. ఐటీపార్కులు, సెజ్‌ల్లోని కార్యాలయాలకు ప్రత్యేకమైన ఆరోగ్య మార్గదర్శకాలతో కూడిన స్టాండర్డ్‌ హెల్త్‌కోడ్‌ని ప్రవేశపెట్టాలని, అగ్నిమాపక మార్గదర్శకాల మాదిరే వీటినికూడా తప్పనిసరి చేయాలని సూచించారు. 

కేంద్రం నుంచి రావాల్సిన ఐటీ, జీఎస్టీ పన్నుల రిఫండ్లను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. మంగళవారం అన్నిరాష్ర్టాల ఐటీశాఖ మంత్రులతో కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఐటీ, అనుబంధ పరిశ్రమను ఆదుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలపై సవివరమైన లేఖ రాస్తానని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఐటీరంగంలోని సూక్ష్మ, మధ్యస్థాయి పరిశ్రమలను ఆదుకోవాలని, రూ.25 లక్షల కన్నా తక్కువగా ఉన్నవారికి పూర్తిగా, రూ.25 లక్షలకుపైగా ఉంటే కనీసం 50 శాతం అయినా ఆదాయ పన్ను బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీఎస్టీపై తొలినాళ్లలో కేంద్రం ప్రకటించిన మినహాయింపుల్లో అయోమయం నెలకొనడంతో అనేక కంపెనీలు పూర్తిస్థాయి పన్నులు చెల్లించాయని.. అయితే ప్రస్తుత మార్గదర్శకాల మేరకు వాటికి రావాల్సిన రిఫండ్లను వెంటనే పూర్తిచేయాలని తెలిపారు. ఇందుకోసం కేంద్రప్రభుత్వ ఐటీ విభాగంలో ఒక హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటుచేసి వివిధశాఖలతో సమన్వయానికి అవకాశం కల్పించాలని సూచించారు.

రుణ సదుపాయాన్ని పెంచాలి

చిన్న, మధ్యతరహా సంస్థలకు రుణ సదుపాయాన్ని కనీసం 50 శాతం పెంచాలని.. తద్వారా మూడు నుంచి నాలుగునెలలపాటు ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు వాటికి వీలు కలుగుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నాలుగు నెలలపాటు వడ్డీ వసూలు చేయవద్దని, రుణ పరిమితికాలాన్ని కనీసం 12 నెలలుగా నిర్దేశించాలని సూచించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లకు సంబంధించిన ప్రత్యక్ష ప్రయోజనాలను పొందే గడువును వచ్చే ఏడాది వరకు పొడిగించాలని కోరారు. ప్రస్తుతం అనేక కంపెనీల్లో ఉద్యోగుల సాంద్రత ఆఫీస్‌ కార్యాలయ స్థలంతో పోలిస్తే ఎక్కువగా ఉన్నదని, దీనిని 100 నుంచి 125 చదరపు అడుగులుగా నిర్దేశించాలని సూచించారు. 


logo