శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 01:18:56

ఊరుమ్మడి చైతన్యం

ఊరుమ్మడి చైతన్యం

  • గ్రామాల పొలిమేరల్లో కంచెలు
  • బయటివారు రాకుండా కట్టడి 
  • స్వీయ నిర్బంధంలోకి పల్లెలు
  • లాక్‌డౌన్‌కు సంపూర్ణ మద్దతు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌  : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుతో లాక్‌డౌన్‌కు పల్లెప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు. కరోనా వైరస్‌ నివారణకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కల్పించిన అవగాహనతో కొత్తవారిని తమ గ్రామంలోకి రాకుండా చర్య లు చేపట్టారు. ఊర్లోకి వచ్చే దారుల్లో చెక్‌పోస్టులు పెట్టి మంగళవారం కాపలా కాశారు. కొన్ని జిల్లాల్లో తమ గ్రామం నుంచి వెళ్లే రోడ్లను సైతం దిగ్బంధించి ప్రయాణాలను నిలిపివేశారు. సర్పంచ్‌, కార్యదర్శి అనుమతి లేనిదే గ్రామంలోకి కొత్తవారిని రానివ్వలేదు. మరోవైపు విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారిని ఇండ్లనుంచి బయటికి రానీయకుండా చూశారు. ఎమర్జెన్సీ వాహనాలు తప్ప మిగతా వాహనాలను పూర్తిగా కట్టడి చేశారు.


రాకపోకలు బంద్‌

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పట్టణాలతో పోలిస్తే పల్లెల్లో చైతన్యం వెల్లివిరిసింది. కరోనా వైరస్‌ తమ దరిచేరొద్దంటూ చాలా గ్రామాలు స్వచ్ఛందంగా నిర్బంధం విధించుకున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 450 గ్రామాలు తమ ఊరికి ఎవరిని రాకుం డా కట్టుదిట్టం చేశాయి. వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో 88 గ్రామాలు రాకపోకలను నిషేధించాయి. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్‌, చేర్యాల, హుస్నాబాద్‌ పరిధిలోని 68 గ్రామా ల్లో ప్రజలు రోడ్డుకు అడ్డంగా ముండ్లకంచెలు, బారీకేడ్లు ఏర్పాటు చేసుకున్నారు. మెదక్‌ జిల్లాలోని 104 గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి యువకులు రోడ్లపై రాకపోకలను నిరోధించారు. గిరిజన తండాలుసైతం రోడ్లపై ముండ్ల కంచెలు వేసి అప్రమత్త మయ్యాయి. 

సంగారెడ్డి జిల్లాలో 20 గ్రామాల ప్రజలు బయటివారిని అడ్డుకున్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 225 గ్రామాలు సరిహద్దులను మూసివేశాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 175 గ్రామాలు వాహనాలను అడ్డుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 94 గ్రామాలు శివార్లలో కంచెలు వేసి బయటి వ్యక్తులను రాకుండా చూశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 60 గ్రామాలు సంపూర్ణ లాక్‌డౌన్‌ను పాటించాయి. బీబీనగర్‌ మండ లం చిన్నరావులపల్లిలోలో యువకులు కర్రలు పట్టుకుని కాపలాకాశారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 276 గ్రామాలు తమ ఊర్లను దిగ్బంధించుకున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా 142 గ్రామాల ప్రజలు రహదారులను మూసివేశారు. పాత మహబూబ్‌నగర్‌ పరిధిలోని 100 గ్రామాలు రాకపోకలను పూర్తిగా నిలిపివేశాయి. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 170 గ్రామాలు నిర్బంధాన్ని అమలు చేస్తున్నాయి.


ఎక్కడికక్కడే నిలుపుదల

కాశీతో పాటు మహారాష్ట్రలోని వివిధ తీర్థయాత్రలకు వెళ్లొస్తున్న యాత్రికుల బస్సును రవాణాశాఖ అధికారులు సీజ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లాకేంద్రంతో పాటు ఆర్మూర్‌ ప్రాంతాలకు చెందిన 55 మంది యాత్రికుల బస్సు మహారాష్ట్ర నుంచి  ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దులో ప్రవేశిస్తుండగా భోరజ్‌ చెక్‌పోస్టు వద్ద ఎంవీఐ శ్రీనివాస్‌ అడ్డుకున్నారు. బస్సును సీజ్‌ చేసి యాత్రికులను వైద్య పరీక్షల కోసం పంపించారు. భూపాలపల్లిలో సింగరేణి యైటిైంక్లెన్‌లో షిరిడీ వెళ్లొచ్చిన ఓ కార్మికుడికి వైద్య పరీక్షలు నిర్వహించకుండానే గనులకు పంపారని పేర్కొంటూ కార్మికులు విధులకు వెళ్లేందుకు నిరాకరించారు. మెదక్‌జిల్లా తూప్రాన్‌ టోల్‌ గేట్‌ వద్ద నుంచి వస్తున్న వాహనాలను పోలీసులు నిలిపి వే శారు. గద్వాల జిల్లా గువ్వలదిన్నె వద్ద సరిహద్దులో ట్రాక్టర్‌ను అడ్డం పెట్టి గ్రామంలోకి కర్ణాటక ప్రజలను అనుమతించకుండా చూసుకున్నారు.

కరోనా వైరస్‌ కట్టడికి పల్లెలు 

ముందడుగు వేశాయి. ఊరు పొలిమేరల్లో అడ్డుకట్టలు వేసి స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి. జనతా కర్ఫ్యూనే కాదు.. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన లాక్‌డౌన్‌ను సైతం తూ.చ. తప్పకుండా అమలు చేస్తూ ఆదర్శంగా నిలిచాయి. స్థానిక ప్రజాప్రతినిధులకు జనం అండగా నిలుస్తుండటంతో అనేక పల్లెలు స్వచ్ఛందంగా దిగ్బంధనం చేసుకున్నాయి. గ్రామాల్లోకి ఇతరులు రాకుండా ముండ్ల కంపలు, బండలు, చెట్లను రోడ్లకు అడ్డంగావేయడంతోపాటు మా ఊరికి రావద్దు అంటూ ప్రజలు హెచ్చరిక బోర్డుల్ని ఏర్పాటు చేశారు.  ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ వారిని  అక్కడే ఉండమని సమాచారం ఇవ్వడం గ్రామీణ చైతన్యాన్ని చాటి చెప్పింది. 


కట్టుదిట్టంగా క్వారంటైన్‌

కరోనా లక్షణాలున్న వారికి క్వారంటైన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన పలువురిని గుర్తించిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్టాంపులు వేసి 14 రోజుల పాటు క్యారంటైన్‌లో ఉండాలని సూచించారు. మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో హవేళి ఘనపూర్‌ మండల కేంద్రంలోని డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను క్యారంటైన్‌కు వినియోగించుకునే ఏర్పాట్లు చేశారు. జపాన్‌ నుంచి వచ్చిన వనపర్తి జిల్లా రేవల్లి మండంలంలోని నాగపూర్‌ గ్రామానికి చెందిన యువకుడి వివరాలు సేకరించి, క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో దుబాయి, సౌదీ నుంచి వచ్చినవారిని వైద్యుల సూచనల మేరకు ఇంటికే పరిమితం చేస్తున్నారు.   

పొక్లెయినర్‌ దాటి పోలేరు..

కరోనా మహమ్మారి తమ గ్రామ పొలిమేరల్లోకి రాకుండా పొక్లెయినర్‌ను అడ్డుపెట్టారు మెదక్‌ జిల్లా హవేళి ఘణపూర్‌ మండలం ముత్తాయిపల్లి గ్రామస్థులు.  కూచన్‌పల్లి వైపు తమ గ్రామ  శివారులో మెయిన్‌రోడ్డుపై పొక్లెయినర్‌ను అడ్డుగా పెట్టి రాకపోకలను నిలిపివేశారు. 


గిరిగీసి.. రోడ్డు మూసి...

ఫొటోలోని ఈ దృశ్యం చూశారా.. కూకట్‌పల్లి పీజేఆర్‌నగర్‌లోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహ సముదాయం ఇది. సాధారణంగా గేటెడ్‌ కమ్యూనిటీ ఇండ్లకు రక్షణగా ఇలాంటి ఏర్పాట్లే శాశ్వత ప్రాతిపదికన చేపడతారు. కానీ ఇప్పుడు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 

చిన్నచిన్న గృహ సముదాయాలే కాదు.. ఇలాంటి సర్కారు గృహ సముదాయాల ముందు ఇలా కర్రలతో బారీకేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను అడ్డుకుంటున్నారు. ఇందుకు కారణం... కరోనా మహమ్మారే. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని గేటెడ్‌ కమ్యూనిటీలు ఇప్పటికే రాకపోకల్ని నిషేధించగా... అందరు ఇంటికే పరిమితమయ్యారు. అయితే నగరంలోని వేలాది కాలనీలు ప్రధాన రహదారులను అనుసరించి ఉండటంతోపాటు నిత్యం కాలనీల్లోని రోడ్ల మీదుగానే నగరవాసుల ప్రయాణం సాగుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం అనేక కాలనీలు కరోనా కట్టడిలో ప్రత్యక్ష భాగస్వాములయ్యాయి. తాము ఇండ్లకే పరిమితం అయినప్పటికీ కాలనీల మీదుగా వెళ్లే వాహనాలతో మళ్లీ రద్దీగా మారుతుందనే భయంతో రాకపోకల్ని నిలిపివేశారు. కాలనీకి రెండు వైపులా కర్రల్ని అడ్డుగా పెట్టి ‘కరోనా నేపథ్యంలో కాలనీలో రాకపోకలు నిషిద్దం’ అంటూ బోర్డులు పెట్టేస్తున్నారు. అయితే ఇలా రాకపోకలు నిలిపివేయడం వల్ల అత్యవసర పనులపై వెళ్లే వాహనదారులు చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుంది. ఆ కాస్త ఇబ్బంది మినహా ఈ సరి‘హద్దు’లు మాత్రం మంచిదే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

‘దయచేసి మా ఊరికి రాకండి. కరోనాను తేకండి. మీకు దండం పెడుతున్నం. మీరూ మావాళ్లే.. కానీ కొద్దిరోజులు మా పల్లెలో కాలుపెట్టకండి’ ఇదీ తెలంగాణ పల్లెల్లో కనిపించిన చైతన్యం. జనం ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో పల్లెల నుంచి పట్నానికి పట్టణం నుంచి పల్లెకు రాకపోకలు నిలిచిపోయాయి. ఊరిలో ఉన్నవాళ్లు ఊరిలోనే ఉండాలన్న కట్టుబాటు గ్రామీణ ప్రాంతాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఇదే చైతన్యం పట్టణాలకు వ్యాపించింది. వరంగల్‌ మహానగరంలోని పెద్ద పెద్ద దుకాణ సముదాయాల వద్ద జనం దూరం దూరంగా ఉండి సరుకులు కొనుగోలు చేస్తున్నారు. కాలనీలోకి వచ్చే రోడ్లను బారీకేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను అడ్డుకుంటున్నారు. 


కరీంనగర్‌లో ఇంటికే సరుకులు..

ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులు కరీంనగర్‌లో తిరిగినట్టు గుర్తించిన అధికారులు కశ్మీర్‌గడ్డ, ముకరంపుర, కలెక్టరేట్‌ ఏరియాలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. ఈ జోన్ల పరిధిలో కరోనా వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశం ఎక్కువగా ఉండటంతో ప్రజలను పూర్తిగా ఇండ్లకే పరిమితం చేశారు. మంగళవారం నగర పాలక సిబ్బంది ప్రొటెక్షన్‌ సూటు వేసుకొని..  ఈ ప్రాంతంలోని ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యంతోపాటు ఇంటికి ఆరు కిలోల కూరగాయల బ్యాగులను అందజేశారు. 

దూరాన్ని పాటిద్దాం.. 
వైరస్‌ను తరిమికొడదాం..

సిద్దిపేట జిల్లాలో లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు. కూరగాయల దుకాణం వద్ద గుమిగూడకుండా.. ఒకరిమీద ఒకరు పడకుండా క్రమశిక్షణ పాటిస్తున్నారు. సోమవారం చేర్యాల పట్టణంలో కూరగాయల వ్యాపారులు కేటాయించిన స్థలంలో వినియోగదారులు వరుసగా నిలబడి ఓపికతో కూరగాయలు కొనుగోలు చేయడంతో అందరిని ఆకట్టుకున్నది.logo