శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 16:02:04

కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం : మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌

కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం : మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌

జనగామ/మహమూబాబాద్‌ : కాళేశ్వరం, ఎస్సారెస్పీ, దేవాదుల, పాలమూరు, రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలం కానుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజ‌న సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ‌శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని జ‌న‌గామ‌, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో మంగ‌ళ‌వారం మంత్రులు విస్తృతంగా పర్యటించారు. జ‌న‌గామ జిల్లా రామ‌వ‌రం, కొడ‌కండ్ల‌, మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరు మండ‌లం నాంచారి మ‌డూరు, అమ్మాపురం గ్రామాల్లో రైతు వేదిక‌ల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు. అలాగే నాంచారి మ‌డూరు గ్రామంలో మొక్క‌లు నాటి ప్ర‌కృతి వ‌నానికి శ్రీకారం చుట్టారు. అలాగే పలు చోట్ల హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అలాగే రైతు వేదికలకు శంకుస్థాపన చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ రైతులను రాజులను చేసేందుకు సీఎం కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారని చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ రైతులను ఇబ్బంది పెట్టకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. కరోనా మహమ్మారి క్రమంలో ధాన్యం కొనుగోలు ఒక్క తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా జరుగలేదన్నారు. రూ.30వేల కోట్ల‌తో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ఘ‌త‌న కెసిఆర్‌దేనని చెప్పారు. రైతుల‌కు సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, రైతు వేదిక‌లు, క‌ల్లాలు, గోదాములు, అందుబాటులో విత్త‌నాలు, ఎరువులు, రుణమాఫీలు ఇలా అనేక ప‌థ‌కాలు కేవ‌లం రైతాంగం కోస‌మే అమ‌లు అవుతున్నాయ‌ని మంత్రులు ఎర్ర‌బెల్లి, స‌త్య‌వ‌తి చెప్పారు. 

రైతు వేదికలతో దళారుల నుంచి విముక్తి

రైతుల వేదికల ఏర్పాటుతో అన్నదాతలకు దళారుల నుంచి విముక్తి కలుగుతుందని మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యానికి తామే ధరలు నిర్ణయించే పరిస్థితులు రావాలన్నారు. అన్నదాత బాగుంటే దేశం బాగుంటుందని, ఆ లక్ష్యంతోనే సీఎం కేసీఆర్‌ రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ప్ర‌తి 5వేల ఎకరాలకు క్లస్టర్‌ చొప్పున ఏర్పాటు చేసి, రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇలా జ‌న‌గామ జిల్లాలోనే 62 రైతు వేదిక‌లు నిర్మిస్తుండగా, ఇప్పటికే తొమ్మిదింటికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. కొడ‌కండ్ల‌లో 40వేల మెట్రిక్ ట‌న్నుల గోదాం రూ.25 కోట్ల వ్య‌యంతో నిర్మిస్తున్నట్లు చెప్పారు.

సీఎం కేసీఆర్‌ రూపొందించిన పథకాలతో పల్లెలో ప్రగతి బాటలు పయనిస్తున్నాయని చెప్పారు. గ‌తంలో ఎన్న‌డూ ఈ స్థాయి ప్ర‌గ‌తిని ప‌ల్లెల్లో చూడ‌లేద‌న్నారు. త‌మ సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో కేసీఆర్‌లాంటి సీఎంని కూడా చూడలేద‌ని, నిరంత‌రం ప్ర‌జ‌లు, రైతులు, వారి సంక్షేమం, అభివృద్ధికి ప‌రిత‌పించే సీఎం మ‌న‌కు ఉండ‌డ మ‌న అదృష్ట‌మ‌ని మంత్రులు తెలిపారు. ఈ సందర్భంగా పాల‌కుర్తి, చెన్నూరు రిజ‌ర్వాయ‌ర్లు పూర్తి చేసి, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం మొత్తానికి సాగునీటిని, మంచినీటిని అందిస్తామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ప్ర‌జ‌ల హ‌ర్ష‌ధ్వానాల మ‌ధ్య ప్ర‌క‌టించారు.

క‌రోనాతో జెర జాగ్ర‌త్త‌!

క‌రోనాతో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, స‌త్య‌వ‌తి రాథోడ్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. మ‌రికొద్ది రోజులు ప్ర‌జ‌లు స్వీయ నియంత్ర‌ణ‌, వ్య‌క్తిగత ప‌రిశుభ్ర‌త‌, ప‌రిస‌రాల పరిశుభ్రత ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ఆయా కార్య‌క్ర‌మాల్లో జ‌న‌గామ‌, మ‌హ‌బూబాబాద్ క‌లెక్ట‌ర్లు నిఖిల‌, గౌతం, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo