శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 02:40:02

పట్టణాభివృద్ధిలో జోరు

పట్టణాభివృద్ధిలో జోరు
  • సాక్షాత్కరిస్తున్న ఆధునిక సంస్కరణల ఫలితం
  • మెరుగ్గా మౌలిక సదుపాయాల అభివృద్ధి
  • రాష్ట్రంలో పట్టణ జనాభా 41.20 శాతం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పట్టణ ప్రాంతాల ప్రాముఖ్యతను ముందే గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టి, అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నదని సామాజిక, ఆర్థిక సర్వే- 2020 వెల్లడించింది. పట్టణాల్లో ప్రజలు నివసించడానికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు ప్రశాంత వాతావరణాన్ని కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతమైందని పేర్కొన్నది. దేశంలో అతి వేగంగా పట్టణాలు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల సరసన తెలంగాణ ప్రముఖంగా నిలుస్తున్నదని తెలియజేసింది. హైదరాబాద్‌తోపాటు వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ వంటి నగరాలు తెలంగాణ పట్టణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేస్తున్నాయి. రాష్ట్రంలో పట్టణ జనాభా 41.20శాతానికి చేరుకున్నది.


పట్టణాల్లో ఆధునిక ఆవిష్కరణలు

పట్టణాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు ఆధునిక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. మంచినీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ, వరద నీటి కాల్వలు, ఘనవ్యర్థాల నిర్వహణ, వాటి రవాణాను చేపట్టడానికి ప్రణాళికలు రచించింది. దాదాపు రూ.980.16 కోట్లతో 32 ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో రూ.730.28 కోట్లతో చేపట్టిన 27 ప్రాజెక్టులు పూర్తిచేసింది. స్మార్ట్‌ సిటీలో భాగంగా జీహెచ్‌ఎంసీ, వరంగల్‌లో రూ.4,135 కోట్లతో 140 ప్రాజెక్టులకు ప్రణాళికలు రచించారు. ఇవి వివిధస్థాయిల్లో ఉన్నాయి. అమృత్‌లో భాగంగా రూ.1,666 కోట్లతో 66 ప్రాజెక్టులు మంజూరు కాగా, 25 పూర్తయ్యాయి. 40 నిర్మాణదశలో ఉన్నాయి. యువకులకు నైపుణ్య శిక్షణ, వడ్డీలేని రుణాలను అందజేస్తున్నది. 2018-19నాటికి రూ.2.45 కోట్లను కేటాయించింది. మూసీ తీర ప్రాంతం అభివృద్ధికి పనులను మొదలుపెట్టింది. వర్షాకాలంలో నీరు సులువుగా ప్రవహించేందుకు ముస్లిం జంగ్‌ బ్రిడ్జి వద్ద 3,900 క్యూబిక్‌ మీటర్ల మట్టిని, 130 క్యూబిక్‌ మీటర్ల చెత్తచెదారాన్ని తొలగించింది. యాదాద్రి, వేములవాడ ఆలయ పట్టణ ప్రాంతాలను వృద్ధి చేయడానికి నడుం బిగించింది.


పల్లెలకు కొత్తందాలు

  • పల్లెప్రగతిలో విస్తృతమైన ప్రజాభాగస్వామ్యం   
  • ఊరికోసం ముందుకొచ్చిన దాతలు

రాష్ట్రంలో రెండువిడుతల్లో నిర్వహించిన పల్లెప్రగతి గ్రామాల రూపురేఖలు మార్చిందని సామాజిక, ఆర్థిక సర్వే నివేదిక- 2020 స్పష్టమైంది. పల్లెప్రగతిలో విస్తృతమైన ప్రజాభాగస్వామ్యం కల్పించారని ప్రశంసించింది. దీంతో గ్రామాలు శుభ్రంగా మారాయని, ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉండటం అభినందనీయమని పేర్కొన్నది. ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు శుభ్రంగామారాయని, నిరంతర బ్లీచింగ్‌తో మురుగు కాల్వలు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయని తెలిపింది. 12,751 గ్రామాల్లో 8,01,619 మంది శ్రమదానం చేశారని ప్రశంసించింది. పల్లెప్రగతి సందర్భంగా చేపట్టిన ప్రధానమైన నర్సరీలు, శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణాలు తుదిదశకు చేరుతున్నాయి. 11,438 గ్రామాల్లో నర్సరీలు పూర్తయ్యాయి. ఈ నర్సరీలలో 12.86 కోట్ల మొక్కలు పెరుగుతున్నాయి. మొత్తం 19,057 రహదారులుండగా.. 55,446 కిలోమీటర్ల పరిధిలో 84.40 లక్షల మొక్కలు నాటారు.  


ప్రణాళికా సైన్యం భాగస్వామ్యం

గ్రామాల్లో ఏర్పాటుచేసిన స్టాండింగ్‌ కమిటీలు మంచి ఫలితాలు ఇచ్చాయని సర్వే పేర్కొన్నది. ప్రతి గ్రామంలో 60 నుంచి 80 మందితో ప్రణాళిక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు ప్రత్యేక కమిటీలను నియమించుకున్నారు. ఈ సైన్యం గ్రామాల్లో శ్రమదానం చేస్తూ పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకున్న తీరును సర్వే అభినందించింది. 


logo