ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 20:44:45

తెలంగాణలో డిగ్రీ పరీక్షలు రద్దు?

తెలంగాణలో డిగ్రీ పరీక్షలు రద్దు?

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎ, బీఎస్సీ, బీకాం డిగ్రీ పరీక్షలను పూర్తిగా రద్దుచేసే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఉన్నత విద్యాశాఖ అధికారులు, ఇంచార్జి వీసీలు, రిజిస్ట్రార్లు, ప్రొఫెసర్లు పరీక్షల రద్దుకే మొగ్గుచూపినట్టు తెలిసింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులను ప్రమోట్‌ చేస్తే బాగుంటుందని సూచించినట్టు సమాచారం. 

ఇప్పటివరకు డిగ్రీలో ఐదు సెమిస్టర్లు పూర్తయ్యాయని, ఇంటర్నల్‌ మార్కులు కూడా ఉన్నాయని, వాటి సగటు లెక్కించి ఫైనల్‌ ఇయర్‌ వారికి డిగ్రీలు ప్రదానం చేయాలని అధికారులు ప్రతిపాదించారు. జేఎన్టీయూహెచ్‌, ఓయూ, ఇతర యూనివర్సిటీల పరిధిలో నిర్వహించనున్న బీటెక్‌ పరీక్షల రద్దు అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్‌ 1 నుంచి డిగ్రీ ఫస్టియర్‌ తరగతులు, ఆగస్టు 15 నుంచి డిగ్రీ, సెకండ్‌, థర్డ్‌ ఇయర్‌ తరగతులను నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపాకే అమలుచేయనున్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి చిత్రారామచంద్రన్‌, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, కళాశాలల విద్య కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌, ఇంటర్‌ బోర్డు సెక్రటరీ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌, కేయూ ఇంచార్జి వీసీ బీ జనార్దన్‌రెడ్డి, టీయూ ఇన్‌చార్జి వీసీ నీతుకుమారి ప్రసాద్‌, జేఎన్టీయూహెచ్‌ ఇన్‌చార్జి వీసీ జయేశ్‌రంజన్‌, ఓయూ రిజిస్ట్రార్‌ గోపాల్‌రెడ్డి, జేఎన్టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌, కేయూ రిజిస్ట్రార్‌ పురుషోత్తం, జేఎన్టీయూహెచ్‌ రెక్టార్‌ గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నాయి.


logo