వీధి వ్యాపారుల రుణాల్లో టాప్

- 62% రుణాలతో దేశంలోనే ప్రథమస్థానం
- పెద్ద రాష్ర్టాల క్యాటగిరీలో తెలంగాణ ఫస్ట్
- 3.30 లక్షల మందికి రూ.330 కోట్లు
- లక్షలోపు జనాభా నగరాల్లో టాప్-10 మనవే
కరోనాతో అత్యంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొన్నది వీధి వ్యాపారులే.. ఆర్థికంగా ఎక్కువ చితికిపోయిందీ వారే.. వ్యాపారాలు లేక నానా కష్టాలుపడ్డారు. అలాంటి వీధి వ్యాపారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వివిధ ప్రాంతాల్లో ఉన్న వీధి వ్యాపారులను గుర్తించింది. కేంద్రం ఇస్తున్న రుణాలను వారి దరికి చేర్చడంలో సఫలమైంది. మూడులక్షల మందికిపైగా రూ.330 కోట్ల రుణాలు మంజూరుచేసి పీఎంస్వాన్ నిధి పథకం అమలులోదేశంలోనే తెలంగాణ టాప్‌లో నిలిచింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యంలో 62 శాతాన్ని చేరుకున్నది.
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ర్టానికి నిర్దేశించిన లక్ష్యంలో 62 శాతాన్ని చేరుకొన్నది. కరోనా లాక్డౌన్, ఆ తరువాత తీవ్రంగా ఇబ్బంది పడ్డ వీధి వ్యాపారులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి (పీఎంస్వాన్ నిధి) పథకం కింద రూ.10 వేలు రుణంగా అందించాలని నిర్ణయించింది. దీని అమలులో ఆయా రాష్ర్టాలకు లక్ష్యాలను ఇచ్చి వీధి వ్యాపారులకు రుణాలు అందించేలా కృషిచేయాలని సూచించింది. ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్, పట్ణణాభివృద్ధి మంత్రిత్వశాఖ విస్తృత ప్రచారం చేపట్టింది. మున్సిపల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. పథకంపై అవగాహన కల్పించింది. ఫలితంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ర్టాలను వెనక్కినెట్టేసి తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. 2020 జూలై 2న పథకం ప్రారంభించినప్పటి నుంచి దీని అమలులో తెలంగాణ ముందున్నది. పీఎంస్వాన్ నిధి పథకంలో తెలంగాణలో 4,38,579 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు 3,30,341 రుణం మంజూరు కాగా, రూ. 330 కోట్లు అందించారు. రుణం మంజూరైనవారిలో 64 శాతం మంది మహిళలే కావడం విశేషం. 50 శాతం మంది కూరగాయలు, పండ్లు దుకాణాల కోసమే రుణం తీసుకున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. 15 శాతం మంది వస్త్ర దుకాణం, 11 శాతం ఫాస్ట్ ఫుడ్, ఫుడ్ ఐటమ్స్ కోసం వెచ్చించినట్టు బ్యాంకుల పేర్కొంటున్నాయి.
సకాలంలో చెల్లిస్తే
ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు రూ.10 వేల రుణాన్ని అందిస్తారు. రుణాన్ని సంవత్సరంలోపు చెల్లించాల్సి ఉంటుంది. రుణానికి ఏడు శాతం వడ్డీ చెల్లించాలి. సంవత్సరంలోపు రుణాన్ని చెల్లిస్తే ఐదు శాతం వడ్డీని తిరిగి ఇచ్చేస్తారు. వీధి వ్యాపారులు ఏడాదిపాటు ప్రతినెలా రూ.25 కంటే ఎక్కువగా 250 డిజిటల్ కార్యకలాపాలు నిర్వహిస్తే వ్యాపారికి నెలకు రూ.100 ఇస్తారు. మొత్తంగా లెక్కిస్తే ఆ వ్యాపారికి పదివేల రూపాయలు వడ్డీ లేని రుణం అందినట్టు అవుతుంది. ఏడాదిలోపు పదివేలు చెల్లించిన తర్వాత ఆ వ్యాపారికి ఇంకా ఎక్కువ మొత్తంలో రుణం ఇస్తారు.
టాప్ 10 నగరాలు తెలంగాణవే
దేశంలో లక్షలోపు జనాభా ఉన్న నగరాల్లో వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో తొలి 10 నగరాలు తెలంగాణవే కావడం విశేషం. లక్షలోపు జనాభా ఉన్న నగరాలు వందల సంఖ్యలో ఉన్నాయి. అందులో టాప్ 10లో అన్నీ తెలంగాణకు చెందినవి కావడం అరుదని అధికారులు చెప్తున్నారు. సిద్దిపేట 5,557 మందికి రుణాలు మంజూరుచేసి దేశంలోనే మొదటిస్థానంలో ఉండగా, ఆ తర్వాత కామారెడ్డి (4,862), నిర్మల్ (4,566), సిరిసిల్ల (4,530), బోధన్ (3,813), పాల్వంచ (3,579), సంగారెడ్డి (3,457), మంచిర్యాల (3,436), కోరుట్ల (3,369), ఆర్మూరు (3,175) పట్టణాలు నిలిచాయి.
పీఎంస్వాన్ నిధి పథకం.. విశేషాలు
33.61 లక్షలు: పీఎంస్వాన్ నిధి పథకంలో దేశవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు. అందులో 17.34 లక్షల మందికి రుణాలు మంజూరయ్యాయి, ఇందులో 12.70 లక్ష ల మందికి రుణ మొత్తాన్ని అందించారు.
4,38,579: తెలంగాణలో వీధి వ్యాపారుల నుంచి వచ్చిన దరఖాస్తులు.
3,30,341: రాష్ట్రంలో రుణం మంజూరైనవారు
రూ.330 కోట్లు: రాష్ట్రంలో ఇప్పటివరకు అందించిన రుణ మొత్తం
2: రుణాల మంజూరులో దేశంలోని 40 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో హైదరాబాద్ స్థానం ఇది. 57,447 దరఖాస్తులు రాగా వీరిలో 30,377 మందికి రుణాలు మంజూరయ్యాయి. అహ్మదాబాద్ నగరం (34,404) మొదటి, సూరత్ (16,449) మూడోస్థానంలో నిలిచాయి.
1: రుణాల మంజూరులో దేశంలో 40 లక్షల లోపు నుంచి 10 లక్షల వరకు జనాభా ఉన్న నగరాల్లో వరంగల్ స్థానం ఇది.
40 లక్షలలోపు నుంచి 10 లక్షల వరకు జనాభా ఉన్న నగరాల్లో గోరఖ్‌పూర్ (13,980), అలీఘర్(12,205) రెండు, మూడుస్థానాల్లో, ఖమ్మం పట్టణం (12,128) నాలుగోస్థానంలో నిలిచాయి. టాప్ 10లో కరీంనగర్, రామగుండం నగరాలు చోటు దక్కించుకున్నాయి.
దేశంలోనే నంబర్‌వన్‌గా వరంగల్
- ప్రధాని నియోజకవర్గం వారణాసిని దాటేసిన ఓరుగల్లు
వీధి వ్యాపారులకు రుణాల మంజూరులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 10 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ప్రధాని నరేంద్రమోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిని వెనక్కి నెట్టి గ్రేటర్ వరంగల్ మొదటిస్థానానికి ఎగబాకింది. 22,719 మందికి రుణాలు అందించి వరంగల్ నంబర్‌వన్‌గా నిలువగా.. 22,542 మందితో వారణాసి రెండో స్థానానికి పరిమితమైంది. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి రుణాలకు అర్హులైన వ్యాపారులను గుర్తించారు. జనవరి 15 నాటికి అర్హులను ఎంపికచేసి, జనవరి 22లోగా ఎంపికైన వారందరికీ రుణాలు అందేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. పీఎం స్వనిధి పథకం అమలులో పని తీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 26న అవార్డులను ప్రదానం చేయనుంది.
తాజావార్తలు
- హైదరాబాద్ నవాబు వారసత్వం కేసును తేల్చండి : సుప్రీం
- ఇదోరకం కల్లు..!
- వచ్చే ఏడాది నౌకాదళం అమ్ములపొదిలోకి INS విక్రాంత్!
- వాట్సాప్ ప్రైవసీ పాలసీ : కేంద్రం ఫైర్
- తెలంగాణకు 2 రాష్ర్టపతి, 12 పోలీసు పతకాలు
- సలార్ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్!
- ఎస్బీఐలో మేనేజర్ పోస్టులు
- 'రాజు'గారి కారులో రారాజుగా తిరిగేయండి
- మోస్ట్ వాల్యూడ్ కంపెనీగా టాటా కన్స్‌ల్టెన్సీ
- ఇంట్లో మందు ఉండాలంటే లైసెన్స్ తీసుకోవాల్సిందే!