బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 01:46:46

మాంసం ముక్క మస్తు రుచి

మాంసం ముక్క మస్తు రుచి

  •  ఉత్పత్తిలో తెలంగాణ జోరు
  • 16.9 శాతం వృద్ధితో తొలిస్థానం
  • గొర్రెల నుంచే అధిక మాంసం ఉత్పత్తి
  • అంతా సబ్సిడీ గొర్రెల పథకం చలవే 
  • జాతీయ పశుగణన లెక్కల్లో వెల్లడి

పండుగకు, పబ్బానికి.. పార్టీకి, ఫంక్షన్‌కు.. మాంసం ముక్క ఉడకాల్సిందే. అదిలేకపోతే నోట్లోకి ముద్ద దిగదు. చికెన్‌, మటన్‌, గుడ్డు.. నాన్‌వెజ్‌ ఏది కనిపించినా సరే జిహ్వకు రుచి చూపించాల్సిందే. ఆ డిమాండ్‌కు తగ్గట్టే ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతున్నది. ముఖ్యంగా తెలంగాణ నుంచి మాంసం ఉత్పత్తి భారీగా పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం ఫలితంగా రాష్ట్రం నుంచి పెద్దమొత్తంలో మాంసం ఉత్పత్తి అవుతున్నది. ఎంతలా అంటే.. ఒక్క ఏడాదిలోనే 16.9 శాతం వృద్ధిని నమోదుచేసింది.


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు పక్కాగా, పకడ్బందీగా, ప్రజల ఇబ్బందులు దూరం చేసేలా ఉండాలి. అలా ఆలోచించి తెలంగాణ ప్రభు త్వం తీసుకున్న మంచి నిర్ణయమే.. సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం. ఈ పథకం వల్ల లక్షలాది మంది ప్రత్యక్షంగా లబ్ధిపొందారు. ఇప్పు డు కోట్లాది మంది ఆ పథక ఫలితాన్ని అనుభవిస్తున్నారు. అవును! రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల మాంసం ఉత్పత్తిలో తెలంగాణ దూసుకుపోతున్నది. దేశంలోనే మరే రాష్ర్టానికి సాధ్యంకాని విధంగా మాంసం ఉత్పత్తిలో రాష్ట్రం ఘనమైన వృద్ధిని సాధించింది.ఫలితంగా దేశంలోనే నంబర్‌ 1 స్థానంలో నిలిచింది.

గొర్రె మాంసం, పౌల్ట్రీ, మేక, గుడ్లు, పాలు, ఉన్ని ఉత్పత్తిలో రాష్ట్రం గొప్ప వృద్ధిని సాధించటంతో ఇటు పెంపకందారులకు, అటు వినియోగదారులకు మేలు జరుగుతున్నది. గణాంకాలను పరిశీలిస్తే.. 2018-19లో మాంసం ఉత్పత్తిలో తెలంగాణ 16.9 శాతం వృద్ధిరేటును నమోదుచేసింది. ఈ రేటు దేశ సగటు వృద్ధిరేటు (6శాతం) కంటే రెండింతలు ఎక్కువ. గొర్రె మాంసం ఉత్పత్తిలో మరే రాష్ట్రం కూడా తెలంగాణకు దరిదాపుల్లో లేదు. తెలంగాణ నుంచి గొర్రె మాంసం అధికంగా ఉత్పత్తి కావటానికి ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం దోహదం చేసిందనేది పలువురి అభిప్రాయం. 1.91 కోట్ల గొర్రెలతో దేశంలోనే అధిక గొర్రెలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. పాల ఉత్పత్తి, వృద్ధిరేటులోనూ తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకున్నది.


సీఎం కేసీఆర్‌ ఆలోచనల ఫలితమే

గొర్రెల పెంపకంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ 1 స్థానంలో నిలవటం గర్వకారణం. సీఎం కేసీఆర్‌ ఏ లక్ష్యంతో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించారో ఆ లక్ష్యం అనతికాలంలోనే నెరవేరటం సంతోషకరం. రాష్ట్రంలో జంతుసంపద గణనీయంగా పెరుగుతున్నది. దీంతో పాటే పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలోనూ తెలంగాణ గొప్ప వృద్ధిరేటును నమోదు చేసింది. ఇదే స్ఫూర్తితో గ్రామీణ వ్యవస్థను, కులవృత్తులను పటిష్ఠం చేసే దిశగా మరింత కృషిచేస్తాం.

- తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రిlogo