శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 25, 2021 , 01:56:45

మహిళా సంఘాలకు 10 వేల కోట్లు

మహిళా సంఘాలకు 10 వేల కోట్లు

  • ఈ ఏడాది ఇప్పటికే 7,519 కోట్లు అందజేత   
  • గతేడాది కంటే 3,800 కోట్లు అదనం
  • తీసుకున్న రుణాల్లో రికవరీ రేటు 98 శాతం   
  • మహిళా సంఘాలకు రుణాల్లో తెలంగాణ టాప్‌
  • ఆరేండ్లలో మూడురెట్లు పెరిగిన రుణాలు    
  • ఆర్థికంగా బలోపేతమవుతున్న రాష్ట్ర మహిళలు

జనాభాలో సగభాగం ఉన్న మహిళలు స్వశక్తితో ఎదిగేలా స్వయం సహాయక సంఘాల నుంచి ఆర్థిక తోడ్పాటు అందుతున్నది. సెర్ప్‌ద్వారా బ్యాంకులు గ్రామీణ మహిళాసంఘాలకు పెద్దఎత్తున రుణాలు ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది రూ.3,700 కోట్ల రుణమివ్వగా.. ఇప్పుడది మూడింతలై రూ.10,267 కోట్లకు చేరింది. 98 శాతం రికవరీ రేటు ఉండటంతో బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. మహిళా సంఘాలకు ఆర్థికంగా చేయూతనిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది.

హైదరాబాద్‌, జనవరి 24 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక మహిళా సంఘాలను బలోపేతం చేయడంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.10,267 కోట్ల రుణం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే రూ.7,519 కోట్లు (73 శాతం) మహిళా సంఘాల వద్దకు చేరాయి. ఇంత పెద్దమొత్తంలో రుణాలిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. ఏపీ రెండోస్థానంలో ఉన్నది. తెలంగాణ ఏర్పడిన నాటితో పోల్చితే మహిళా సంఘాలకు రుణాలు దాదాపు మూడింతలు పెరిగాయి. మహిళలు స్వయంశక్తితో ఎదిగేలా వారికి ఉత్పాదక అవసరాలపై పెట్టుబడులు పెట్టడానికి సెర్ప్‌ సంస్థ ద్వారా ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తున్నది. వీటిద్వారా మహిళా సంఘాలు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకుంటూ, ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు చేస్తున్నాయి. బయట అధిక వడ్డీకి అప్పులు తీసుకోకుండా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాల్లో 98 శాతం రికవరీ రేటు ఉండటంతో బ్యాంకులు కూడా మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది రూ.3,700 కోట్లు ఇవ్వగా.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 10,267 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నది. ఇది గతేడాది కన్న రూ.3,800 కోట్లు అదనం. కాగా, ఇప్పటివరకు 2.34 లక్షల సంఘాలకు రూ.7,519 కోట్ల రుణాల పంపిణీ పూర్తయింది. మార్చి నెలాఖరు నాటికి నిర్దేశించుకున్న లక్ష్యం కన్న అధికంగానే రుణాలు అందుతాయని అధికారులు చెప్తున్నారు. ప్రతిసారి మార్చిలో బ్యాంకులు అత్యధిక రుణాలు ఇస్తుంటాయని, దీంతో లక్ష్యం కన్న ఎక్కువగానే మహిళా సంఘాలకు రుణాలు అందుతాయని వివరిస్తున్నారు. కరోనా సమయంలోనూ రుణాలు తీసుకోవడానికి సంఘాలు, ఇవ్వడానికి బ్యాంకులు  ముందుకొస్తున్నాయి. కరోనా సమయంలోనూ రూ.600 కోట్లు అందించారు.

ఉత్పాదక రంగాలపైనే..

రాష్ట్రం వచ్చిన కొత్తలో మహిళా సంఘంలో ఒక్కో సభ్యురాలికి సగటున రూ.20 వేలు రుణమివ్వగా, ఇప్పుడు రూ.80 వేలు ఇస్తున్నారు. ఒక్కో గ్రూపునకు సగటున రూ.1.90 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెరిగింది. దాదాపు మూడింతలు పెరిగింది. మహిళలు తాము తీసుకున్న రుణాల్లో 90శాతం వరకు ఉత్పాదకరంగాలపైనే వెచ్చిస్తున్నారు. ఎక్కువగా వ్యవసాయ అనుబంధరంగాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో అత్యధికంగా వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 86 శాతం రుణాలివ్వగా.. తర్వాత స్థానంలో సిద్దిపేట 83శాతం, కామారెడ్డి 82 శాతం ఉన్నాయి. తక్కువగా రుణమిచ్చిన జిల్లాల్లో ఆసిఫాబాద్‌ (60 శాతం), వనపర్తివనపర్తి (61), గద్వాల (63), సూర్యాపేట (64) ఉన్నాయి.

నాలుగుసార్లు లోన్లు తీసుకున్నం

మా సంఘాన్ని 2012లో పెట్టినం. ఇప్పటిదాకా నాలుగు లోన్లు తీసుకున్నం. ఫస్ట్‌ రూ.50 వేలు తీసుకోగా.. కొద్దిరోజుల కింద రూ.7.50 లక్షలు తీసుకున్నం. ఈ డబ్బులను వ్యవసాయ పనులకు, షాపులు పెట్టుకోవడానికి, పిల్లల చదువులకు వాడుకున్నాం. ఐదుగురం కలిసి జ్యూట్‌ బ్యాగుల పరిశ్రమ పెట్టుకున్నం. బ్యాంకు లోన్లతో మా అవసరాలు తీరుతున్నాయి. తిరిగి కడుతున్నాం. మళ్లీ లోన్లు ఇస్తున్నారు. ప్రభుత్వం, సెర్ప్‌ , బ్యాంకు అధికారులు మంచిగా సహకరిస్తున్నారు. 

- వాణి, వినాయక సంఘం, కుకునూరుపల్లి, సిద్దిపేట జిల్లా 

మిత్తీల కష్టం పోయింది 

2008 నుంచి ఇప్పటిదాకా ఐదుసార్లు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నం. ఫస్ట్‌ రూ.75 వేలు, తర్వాత రూ.1.50 లక్షలు ఇచ్చింది. ఇప్పుడు రూ.5 లక్షలు తీసుకున్నం. తీసుకున్న రుణంతో పిండి గిర్ని పెట్టిన. బాగా నడుసున్నది. పసుపు గిర్ని కూడా పెట్టలనుకుంటున్న. బయట తీసుకుంటే రూ. మూడు కట్టాల్సి వచ్చేది. బ్యాంకులో మిత్తి తక్కువ. ఏదైనా అవసరముంటే ఈ లోన్లు మంచిగా అక్కరకొస్తున్నయ్‌. గతంలో ఆడవాల్లకు బ్యాంకు కాడికి పోయే తెలివి ఎక్కడుండేది. ఈ పైసలతో పనులు చేసుకుంటు మంచిగా బతుకుతున్నం. ఇంకా లోన్లు తీసుకుంటం. ప్రతి నెల మీటింగ్‌లు పెట్టుకుంటున్నం. 

- లలిత, చామంతి సంఘం అధ్యక్షురాలు, పెద్దరావులపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా


VIDEOS

logo