బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 02:57:21

రుణ సంధానంలో టాప్‌

రుణ సంధానంలో టాప్‌

  • త్రైమాసికానికే 17.56 శాతం లక్ష్య సాధన 
  • నేషనల్‌ రూరల్‌ లైవ్‌వీ వుడ్స్‌ మిషన్‌ వెల్లడి
  • లక్ష్యం: 86.61 కోట్లు
  • మొదటి త్రైమాసికంలో సాధించింది: రూ.15.21 కోట్లు
  • రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు: 3,17,333 
  • మొత్తం రుణ అనుసంధాన 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులోనూ తెలంగాణ నంబర్‌వన్‌గా నిలుస్తున్నది. ఇప్పటికే ఉపాధి హామీ పనుల్లో లక్ష్యాన్ని ముందే సాధించి రికార్డులు తిరగ రాయగా, తాజాగా స్వయం సహాయక సంఘాలకు రుణ అనుసంధానంలో నంబర్‌వన్‌గా నిలిచింది. దేశంలోని స్వయం సహాయక సంఘాల్లో మన రాష్ట్రం వాటా 36.37 శాతంగా ఉండగా, ఆయా సంఘాలకు ఆర్థిక రుణఅనుసంధానంలో ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే 17.56 శాతం లక్ష్యాన్ని సాధించింది. దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా లక్ష్యాన్ని చేరుకొని కొత్త రికార్డు సృష్టించింది. నేషనల్‌ రూరల్‌ లైవ్‌లీవుడ్స్‌ మిషన్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా మహిళలే సభ్యులుగా పొదుపుతోపాటు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు పొందుతూ స్వయంసహాయక సంఘాలు దూసుకుపోతున్నాయి. మన రాష్ట్రంలో 3,17,333 సంఘాలున్నాయి. వీటికి ఈ ఆర్థిక సంవత్సరం రూ.86.61 కోట్లు రుణ అనుసంధానం చేయాలనేది లక్ష్యం. కాగా ఇప్పటివరకు 1,15,409 సంఘాలకు రూ.15.21 కోట్లు ఆర్థికసాయం అందించడం విశేషం. 

మహిళా సంఘాల పనితీరు అద్భుతం : మంత్రి  ఎర్రబెల్లి

స్వయం సహాయక సంఘాలకు రుణఅనుసంధానంలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలువడంపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం, సమర్థపాలనతోనే ఇది సాధ్యపడిందని చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ తెలంగాణలోని మహిళా సంఘాలు అద్భుతంగా పనిచేశాయని ప్రశంసించారు. రుణ అనుసంధానానికి సహకరించిన బ్యాంకర్లు, సమర్థంగా పనిచేస్తున్న సెర్ప్‌ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి సందీప్‌కుమార్‌ సుల్తానియా, అధికారులను అభినందించారు.

logo