మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 01, 2020 , 02:18:55

తెలంగాణలో నేలలు పత్తి సాగుకు చాలా అనుకూలం

తెలంగాణలో నేలలు పత్తి సాగుకు చాలా అనుకూలం

 • పత్తి అదునుచూసి విత్తు!
 • ఈ నెల 15లోపు వేస్తేనే మంచి ఫలితం
 • సమగ్ర విధానంలో పత్తి పంటకు సింహభాగం
 • 61.48 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు 
 • అధిక దిగుబడులకు రాష్ట్రంలో అనువైన నేలలు
 • ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులకు అవకాశం

ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులకు మంచి అవకాశం ఉన్న పంట పత్తి. పలుదేశాల్లో పత్తి సాగు దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఈ ఏడాది ఈ ఎగుమతులు మరింతగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన సమగ్ర వ్యవసాయవిధానంలో పత్తి పంట సాగుకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. రాష్ట్రంలో 1.35 కోట్ల ఎకరాల వానకాలంసాగులో 61.48 లక్షల ఎకరాల్లో ఈ పంటను వేయాలని తేల్చింది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పత్తి విత్తనాలను పెద్దఎత్తున ఎగుమతి చేస్తున్నది. వస్త్ర పరిశ్రమకు ప్రధాన ముడిసరుకును అందించే వాణిజ్యపంట పత్తిని అదునుచూసి విత్తితే తెల్ల బంగారమే అవుతుంది. 


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో నేలలు పత్తి సాగుకు చాలా అనుకూలం. దాదాపు అన్ని జిల్లాల్లోనూ పత్తిని ప్రధాన పంటగా సాగుచేస్తున్నారు. ఈ పంట సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌ తర్వాత తెలంగాణ మూడోస్థానంలో ఉన్నది. ప్రపంచంలో పత్తి పండించే దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉండగా.. ఉత్పత్తి, ఎగుమతుల్లో రెండోస్థానంలో కొనసాగుతున్నది. తెలంగాణలో ఎక్కువగా లోతైన నల్లరేగడి భూములు పత్తిసాగుకు అనుకూలంగా ఉంటాయి. నీటివసతి గల మధ్యస్థ భూముల్లోనూ దీనిని సాగుచేయవచ్చు. ఇసుక నేలలు, మరీ తేలికపాటి చల్క భూములు పత్తి సాగుకు వర్షాధారంగా అంత అనుకూలంగా కావుకానీ, నీళ్లుపారే వసతి ఉంటే అధిక దిగుబడులు సాధించవచ్చు. ఉదజని సూచిక 6 నుంచి 8 గల భూముల్లో పత్తిని సాగుచేయవచ్చు. ఈ భూములు రాష్ట్రంలోని 32 జిల్లాల్లోనూ విస్తరించి ఉన్నాయి. పెరిగిన సాగు నీటిసౌకర్యంతో అధిక దిగుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయి. పెరిగిన బీటీ టెక్నాలజీతో మరింత భరోసా ఉంటుంది. పత్తిలో వందశాతం అధిక దిగుబడినిచ్చే హైబ్రీడ్లనే వాడుతున్నారు. సాగునీటి వసతి, పెట్టుబడికి రైతుబంధుతో పత్తి సాగుకు రాష్ట్రంలో మహర్దశ రానున్నది.

జూలై 15 దాటి విత్తితే చిత్తే 

పత్తి సాధారణంగా వార్షిక పంట. పంటకాలం ఏడునుంచి ఎనిమిది నెలలు ఉంటుంది. దీంతో వానకాలంలో సాగుకు మాత్రమే అనుకూలం. మే చివర నుంచి జూన్‌ 15 మధ్య విత్తితే అధిక దిగుబడులు పొందవచ్చు. జూలై 15 వరకు వేయవచ్చు. అయితే, వర్షాధారంగా జూలై 15 తర్వాత పత్తి వేస్తే దిగుబడి చాలా తక్కువగా వస్తుంది. నీటివసతి ఉన్నచోట పత్తిని మే చివర లేదా జూన్‌ మొదటి పక్షంలో విత్తుకొంటే దిగుబడులు బాగా వస్తాయి. తొలకరిలో కనీసం 60 మి.మీ వర్షం కురిసిన తర్వాత మంచి తేమలో పత్తిని విత్తుకొంటే, భూమిలో వేడితగ్గి, మొలకశాతం బాగుంటుంది. 

బీటీ పత్తి విత్తన కేంద్రంగా తెలంగాణ


దేశానికి కావాల్సిన విత్తన అవసరాల్లో 65 శాతం విత్తనోత్పత్తి తెలంగాణ నుంచే జరుగుతున్నది. దేశంలో 5.80 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు ఉత్పత్తి అయితే.. అందులో రాష్ట్రం 2.21కోట్ల ప్యాకెట్లు ఉత్పత్తిచేస్తూ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఎకరానికి 450 గ్రాముల ప్యాకెట్లు రెండు చొప్పున 61.48 లక్షల ఎకరాలకు 1.23 కోట్ల ప్యాకెట్లు రాష్ట్రంలో వినియోగించగా.. మిగిలినవి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. తమిళనాడు, ఏపీ, పంజాబ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలకు తెలంగాణ బీటీ పత్తి విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో గద్వాల, వరంగల్‌, కరీంనగర్‌, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో బీటీ పత్తి హైబ్రీడ్‌ విత్తనోత్పత్తి జరుగుతున్నది. దేశంలో 2002లో మూడు బీటీ పత్తి హైబ్రీడ్‌ రకాలు వాణిజ్యసాగులోకి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 1,300 రకాలకుపైగా బీటీ పత్తి రకాలున్నాయి. అయితే ప్రభుత్వరంగ సంస్థలు, విశ్వవిద్యాలయాల నుంచి ఇప్పటివరకు ఒక్క బీటీ పత్తి హైబ్రీడ్‌ విత్తనం కూడా సాగుకు విడుదల కాలేదు. దీంతో రైతులు ప్రైవేటు విత్తన సంస్థల నుంచే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రైవేటు విత్తనరంగ సంస్థలు లాభాలు గడిస్తున్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయం మేలైన పత్తి హైబ్రీడ్‌ విత్తనాలను అభివృద్ధి చేసి, బీటీ జన్యువులను జొప్పించి విడుదలచేస్తే రైతులకెంతో మేలు జరుగుతుందని రైతుసంఘాలు పేర్కొంటున్నాయి.

గులాబీ రంగు పురుగుతోనే గుబులు


పత్తిపంటకు పధాన సమస్య గులాబీ రంగు పురుగు ఆశించడం. పూతదశలో అప్రమత్తంగా ఉండి దీనినుంచి కాపాడుకోగలిగితే పత్తి తెల్లబంగారమే అవుతుంది. హైబ్రీడ్‌ రకాలను వర్షాధారంగా సాగుచేయడం వల్లే ఈ పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇప్పుడు టెక్నాలజీ మారడం, రాష్ట్రంలో సాగునీటి వసతి పెరుగడంతో ఇది అంత పెద్ద సమస్య కాకపోవచ్చు. వర్షానికి తోడు.. 4,5 నీటి తడులిస్తే బ్రహ్మాండమైన దిగుబడులు వస్తాయి. 

పత్తిసాగులో మెళకువలు

 • పత్తిని వీలైనంత త్వరగా విత్తాలి. మే చివరి నుంచి జూన్‌ 15లోపు విత్తితే మంచి దిగుబడులు వస్తాయి.
 • జూలై 15 తర్వాత వీలైనంత వరకు పత్తిని సాగుచేయవద్దు.
 • తేలిక నేలల్లో పత్తిని సాగుచేసేటప్పుడు మొక్కల సంఖ్య మామూలు కంటే ఎక్కువగా ఉండేలా దగ్గరగా విత్తుకోవాలి.
 • నేల స్వభావాన్ని, నీటి వసతులను దృష్టిలో ఉంచుకొని సరైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి.
 • మందులు వాడి మొదటిదశలో వచ్చే కలుపును సమర్ధంగా నివారించుకోవాలి.
 • ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్లెక్స్‌ ఎరువులను పైపాటుగా వేయరాదు. నత్రజని, పొటాష్‌, ఎరువులను మాత్రమే పైపాటుగా వేసుకోవాలి.
 • 8 శాతం తేమ ఉన్న పత్తిని గోనె సంచుల్లో తొక్కి తేమ తగలని చోట నిల్వ చేయవచ్చు. మంచిరేటు రాగానే మార్కెట్‌లో అమ్మవచ్చు.


విత్తనంలో హైబ్రీడ్‌దే కాలం

సాధారణంగా పత్తిలో కాయతొలుచు పురుగును తట్టుకొనే బీటీ హైబ్రీడ్‌ను విత్తనాలను ఎక్కువగా వేస్తుంటారు. ఇవన్నీ ప్రైవేటు కంపెనీలకు చెందిన వంగడాలే కావడంతో.. రైతులు తమప్రాంతానికి అనువైన, దిగుబడులను, సామర్థ్ధ్యాన్ని ఆధారంగా చేసుకుని వంగడాలను ఎంపికచేసుకోవాలి. వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు త్వరగా పూత, కాతకు వచ్చే మధ్యస్థ, చిన్నసైజు కాయవంగడాలను, రకాలను వేయా లి. నీటివసతి ఉన్నచోట కొంచెం ఆలస్యం గా పూత, కాతకు వచ్చే మధ్యస్థ, పెద్దసైజు రకాలను ఎంపికచేసుకోవాలి. వర్షాధారం గా తక్కువ పెట్టుబడి సాగు చేయాలనుకున్నప్పుడు మంచి సూటిరకాలను విత్తన లభ్యత ఆధారంగా ఎంపికచేసుకోవచ్చు. నరసింహ, శ్రీరామ (ఎన్‌డీఎల్‌హెచ్‌-1983), డబ్బుజీసీవీ-48, డబ్ల్యూజీసీవీ-79, ఏడీబీ-39 తదితర రకాలు తెలంగాణ భూములకు అనుకూలం. ఇటీవల అధిక సాంద్రత పత్తి సాగులోనూ కంపెనీలు అందజేస్తున్న స్వల్పకాలిక బీటీ హైబ్రీ డ్‌ విత్తనాలను రైతులు వాడుతున్నారు.

 విత్తనోత్పత్తిలో మనమే టాప్‌ 

దేశ విత్తన అవసరాల్లో 65 శాతం విత్తనోత్పత్తి తెలంగాణ నుంచే జరుగుతున్నది. దేశంలో 5.80 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు ఉత్పత్తి అయితే.. అందులో రాష్ట్రం 2.21కోట్ల ప్యాకెట్లు ఉత్పత్తి చేస్తూ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఎకరానికి 450 గ్రాముల ప్యాకెట్లు రెండు చొప్పున 61.48 లక్షల ఎకరాలకు 1.23 కోట్ల ప్యాకెట్లు రాష్ట్రంలో వినియోగించగా.. మిగిలినవి తమిళనాడు, ఏపీ, పంజాబ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో గద్వాల, వరంగల్‌, కరీంనగర్‌,నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో బీటీ పత్తి హైబ్రిడ్‌ విత్తనోత్పత్తి జరుగుతున్నది. 


logo