శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 04, 2020 , 04:25:14

తాజా కేసులు 1,892

తాజా కేసులు 1,892

జీహెచ్‌ఎంసీలో 1,658 మందికి కరోనా.. 20 వేలు దాటిన బాధితులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. శుక్రవారం రికార్డుస్థాయిలో 1,892 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో1,658 కేసులు నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 56, మేడ్చల్‌మల్కాజిగిరి 44, వరంగల్‌రూరల్‌ 41, సంగారెడ్డి 20, నల్లగొండ 13, మహబూబ్‌నగర్‌ 12, మహబూబాబాద్‌ 7, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి 6 చొప్పున, వనపర్తి 5, భద్రాద్రి కొత్తగూడెం 4, సిద్దిపేట, మెదక్‌, నిజామాబాద్‌ 3 చొప్పున, నిర్మల్‌, ఖ మ్మం 2 చొప్పున, కరీంనగర్‌, జోగుళాంబ గద్వా ల, ములుగు, జగిత్యాల, వరంగల్‌అర్బన్‌, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌ 1 చొప్పున రికార్డయ్యాయి. చికిత్స అనంతరం కోలుకొన్న 1,126 మంది డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ కారణంగా ఎనిమిది మంది ప్రా ణాలు కోల్పోయారు. రాష్ట్రం లో ఇప్పటివరకు మొత్తం 1,04,118 పరీక్షలుచేయగా, 20,462 పాజిటివ్‌గా నిర్ధారణ తే లింది. మొత్తం 283 మంది మరణించారని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.

విప్‌ గొంగిడి సునీతకు పాజిటివ్‌

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొద్దిరోజులుగా ఆమె జలుబుతో బాధపడుతూ గురువారం హైదరాబాద్‌లోని కరోనా పరీక్ష చేయించుకోగా శుక్రవారం పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. విప్‌తోపాటు ఆమె వద్ద పనిచేసే ఇద్దరు సిబ్బందికి కూడా పాజిటివ్‌గా తేలింది. విప్‌ భర్త, టెస్కాబ్‌ వైస్‌చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డితోపాటు మరికొంత మంది సిబ్బందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావాల్సి ఉన్నది.

ఒక ప్రైవేట్‌ ల్యాబ్‌లో అత్యధికం

ఒక ప్రైవేట్‌ ల్యాబ్‌లో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు రిపోర్టు వచ్చింది. అనుమతి ఇచ్చినప్పటి నుంచి ఆ ల్యాబ్‌లో 3,726 పరీక్షలుచేయగా, ఇందులో 2,672 పాజిటివ్‌గా తేలాయి. దీనిపై వాస్తవాలు తేల్చేందుకు నిపుణుల కమిటి పనిచేస్తున్నది. అప్పటివరకు ఆ ల్యాబ్‌కు సంబంధించిన డాటాను పక్కన పెడుతున్నామని బులెటిన్‌లో తెలిపారు. 

జుడిషియల్‌ అకాడమీలో ఒకరు మృతి

సికింద్రబాద్‌లోని జుడిషియల్‌ అకాడమీలో దిగువస్థాయి సిబ్బంది ఒకరు కరోనా బారినపడి  మృతిచెందారు. దీంతో అకాడమీని వారంపాటు మూసేయాలని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. కేసుల విచారణ సందర్భంగా సీజే ఉద్యోగి చనిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. విచారణకు హాజరయ్యే న్యాయవాదులకు జుడిషియల్‌ అకాడమీలో వీడియోకాన్ఫరెన్స్‌ సౌకర్యంతో కంట్రోల్‌రూంలను ఏర్పాటుచేశారు. వీడియోకాన్ఫరెన్స్‌ సౌకర్యాలు లేని న్యాయవాదులు ఇక్కడికి వచ్చి వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం అకాడమీని మూసేయడంతో న్యాయవాదుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు హైకోర్టు రిజిస్ట్రీ ఉద్యోగుల్లో దాదాపు 20 మందికి వైరస్‌ సోకడం ఆందోళన కలిగిస్తున్నది. 


logo