ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:13:23

ఆధునిక సేద్యం

ఆధునిక సేద్యం

 • సాగులో పరివర్తన రావాలి.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి
 • తెలంగాణ రైతు ధనిక రైతుగా మారాలి.. అన్నదాతలు సంఘటిత శక్తిని చూపాలి
 • సింగిల్‌ పిక్‌ క్రాప్స్‌ విధానాన్ని పరిశీలించాలి
 • అధికారులు, రైతులు విజ్ఞానయాత్రలకు వెళ్లాలి
 • దేశవిదేశాల్లో విధానాలపై అధ్యయనంచేయాలి
 • వాటిని మన రాష్ట్రంలో అమలు చేయాలి
 • వ్యవసాయశాఖ పునర్వ్యవస్థీకరణ అవసరం 
 • ఉద్యానశాఖను కూడా ప్రక్షాళన చేయాలి
 • తెలంగాణ అన్నదాతల్లో చైతన్యం ఎక్కువ
 • మక్కలసాగు వద్దని చెప్తే ఎవరూ వేయలేదు
 • వ్యవసాయరంగాభివృద్ధికి మనవద్దే ప్రయత్నం
 • వ్యవసాయశాఖ సమీక్షలో సీఎం కేసీఆర్‌

‘తెలంగాణ రైతులు మార్పును అందిపుచ్చుకునే చైతన్యం గలవారు. నియంత్రిత పద్ధతిలో సాగును వందకు వంద శాతం అమలుచేశారు. వానకాలంలో మక్కలు వేయొద్దంటే ఎవరూ వాటిజోలికి వెళ్లలేదు. ప్రభుత్వ ప్రయత్నాలు తమకోసమేనని రైతులు గ్రహించారు. వారికి సరైన మార్గదర్శనం చేస్తే.. వ్యవసాయాన్ని తప్పక లాభదాయకంగా మార్చొచ్చు. తెలంగాణ రైతును ధనిక రైతును చేయొచ్చు.’

- వ్యవసాయశాఖ సమీక్షలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లక్షలమంది రైతులు.. కోటి ఎకరాల విస్తీర్ణంలో చేస్తున్న సాగును లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయశాఖ మొండిగా పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. వ్యవసాయంలో గొప్ప పరివర్తన రావాలని, సంప్రదాయ విధానాలకు స్వస్తిపలికి.. ఆధునిక పద్ధతులను అవలంబించాలని సూచించారు. రైతుల సంఘటిత శక్తి ఏంటో చూపేలా వ్యవసాయశాఖ మార్గదర్శనం చేయాలన్నారు. తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్నదని, అందుకుతగ్గట్టు వ్యవసాయశాఖ కూడా సంస్థాగతంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అవసరమైతే వ్యవసాయశాఖకు మరిన్ని పోస్టులు మంజూరుచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రంలో రైతులు నూటికి నూ రుశాతం చెప్పిన పంటలే వేశారని సీఎం సంతోషం వ్యక్తంచేశారు. ఏ గుంటలో ఏ రైతు ఏ పంట పండిస్తున్నారో కచ్చితమైన వివరాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు తెలంగాణలో అమలయ్యేలా వ్యవసాయశాఖ అధికారులు చూడాలని ఆదేశించారు.

గతంలోలేని ప్రయత్నం జరుగుతున్నది

‘వ్యవసాయరంగ అభివృద్ధికి దేశంలో గతంలో ఎన్నడూ జరుగనంత ప్రయత్నం తెలంగాణలో జరుగుతున్నది. వేలకోట్లతో ప్రాజెక్టులు నిర్మించి, రైతులకు సాగునీరం దిస్తున్నాం. నీటితీరువా రద్దుచేయడంతోపాటు పాతబకాయిలను కూడా మాఫీ చే శాం. ప్రభుత్వం వ్యవసాయానికి 24 గం టల కరెంటును ఉచితంగా అందిస్తున్నది. రైతుబంధు పథకం కింద వ్యవసాయానికి పెట్టుబడిని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. ఏ కారణంచేత రైతు మరణించినా అతడి కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా సొమ్ము అందిస్తున్నది. కరోనా కష్టకాలంలోనూ రైతులు పండించిన పంటను నూటికి నూరుశాతం కొనుగోలు చేసింది. రైతులను సంఘటితపర్చేందుకు రైతుబంధు సమితులను ఏర్పాటుచేసింది. రైతుల్లో చైతన్యం తెచ్చేందుకు క్లస్టర్లవారీగా ఏర్పాటుచేస్తున్న రైతు వేదికల నిర్మాణం మూడునెలల్లో పూర్తవుతుంది. వీటిద్వారా సీఎంతోపాటు, ఎవరైనా నేరుగా రైతులతో మాట్లాడే వెసులుబాటు కలుగుతుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరించారు. 

పౌష్టికాహారాన్ని అందించాలి

‘విపత్తుల వల్ల ఏర్పడే ఆకలి సమస్య చాలా దారుణమైనది. యుద్ధంకన్నా ఆకలి ఎక్కువ విలయం సృష్టిస్తుంది. కాబట్టి దే శం ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించాలి. 135కోట్ల జనాభా ఉ న్న దేశానికి మరేదేశం తిండి పెట్టలేదు. మనప్రజలకు మనమే ఆహారమందించేలా ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృ ద్ధి సాధించాలి. దేశం స్వయంపోషకం కావాలి. ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రయత్నంచేయాలి’ అని సీఎం చెప్పారు. సమావేశంలో వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి, అడిషనల్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌, డిప్యూటీ డైరెక్టర్‌ శైలజ తదితరులు పాల్గొన్నారు.


logo