ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 19:46:45

ఆగ‌స్టు 3 నుంచి గ్రామ‌పంచాయ‌తీల ఆన్‌లైన్ ఆడిటింగ్ ప్రారంభం

ఆగ‌స్టు 3 నుంచి గ్రామ‌పంచాయ‌తీల ఆన్‌లైన్ ఆడిటింగ్ ప్రారంభం

హైద‌రాబాద్ : గ్రామ పంచాయతీలు వినియోగించే నిధుల ఆన్‌లైన్ ఆడిటింగ్ ఆగస్టు 3వ తేదీ నుండి రాష్ట్రంలో ప్రారంభం కానుంది. సిబ్బందికి అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 15 వ ఆర్థిక కమిషన్ నిధుల విష‌యంలో కేంద్రం ఆదేశించిన విధంగా ఆడిటింగ్ చేసేందుకు రాష్ర్టం సిద్ధంగా ఉంది. తెలంగాణలో 542 మండలాలు, 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సుమారు 3,830 గ్రామ పంచాయతీలలో మొద‌టిద‌శ ఆన్‌లైన్ ఆడిటింగ్ ప్రారంభమవుతుంది. అనంత‌రం ఇతర గ్రామ పంచాయతీలకు విస్తరించబడుతుంది. ఆన్‌లైన్ ఆడిటింగ్ కోసం 350 మంది ఆడిటింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. అక్టోబర్ 31న ఆన్‌లైన్ ఆడిటింగ్ మొదటి స్పెల్ ముగుస్తుంది. ఈ ఆడిటింగ్‌లో సుమారు 336 మంది ఆడిటర్లు పాల్గొంటారు.

పంచాయతీ రాజ్, ఆడిట్ విభాగాల అధికారులు ఇప్పటికే అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ఒక‌రికొక‌రు సమన్వయంతో పనిచేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఆన్‌లైన్ ఆడిటింగ్ గురించి పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. గ్రామీణ స్థానిక సంస్థలలో అభివృద్ధి కార్యకలాపాలకు మరిన్ని నిధులు పొందడానికి గ్రామ పంచాయతీలు ఆన్‌లైన్ ఆడిటింగ్ పూర్తి చేయడాన్ని 15 వ ఆర్థిక కమిషన్ తప్పనిసరి చేసింది. అక్టోబర్ ముగిసేలోపే రాష్ట్రాల్లో కనీసం 20 శాతం గ్రామ పంచాయతీల ఆన్‌లైన్ ఆడిటింగ్ పూర్తి చేయాలని కోరింది. ఏదేమైనా కాగిత రహిత పరిపాలన దిశగా ఈ-ఆఫీస్‌ వ్యవస్థను ఇప్పటికే ప్రవేశపెట్టిన రాష్ట్రం ప్ర‌భుత్వం గడువుకు ముందే 30 శాతం గ్రామ పంచాయతీలలో ఆన్‌లైన్ ఆడిటింగ్ పూర్తిచేయాల‌ని నిర్ణయించింది.


logo